నల్లమలలో పులిని వేటగాళ్లే చంపేశారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నల్లమలలో పులిని వేటగాళ్లే చంపేశారు

ఇంటి దొంగలపైనా అనుమానం
కర్నూలు, సెప్టెంబర్ 27, (way2newstv.com)
నల్లమల అటవీ సమీపంలోని రుద్రవరం రేంజ్‌ మిట్టపల్లి వద్ద  పులి పిల్ల మృతిచెందిన ఘటనలో నిజం నిగ్గుతేలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల ఒకటిన పులిపిల్ల కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న  అటవీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. అయితే ప్రమాదవశాత్తు మృతిచెందిందా? వేటగాళ్ల చేతిలో బలైందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు రాష్ట్ర స్థాయి అటవీ అధికారులు సతమతమయ్యారు.  ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ కూడా రానుండడంతో మిస్టరీ వీడే సూచనలు కన్పిస్తున్నాయి.నీటిలో పడి మృతి చెందిందనుకోవడానికి కనీసం గుక్కెడు నీళ్లు కూడా తాగిన దాఖలాలు లేవు. పెద్దపెద్ద సెలయేళ్లను సైతం అవలీలగా ఈదగలిగే పులులు ఇలాంటి చిన్న కుంటలను, వంకలను ఈద లేక ఎలా మృతిచెందుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. 
నల్లమలలో పులిని వేటగాళ్లే చంపేశారు

దీనికి తోడు మృతి చెందిన పులిని నీళ్లలో నుంచి గట్టుకు చేర్చిన వెంటనే దాని ముక్కులో నుంచి రక్తం కారడం పలు అనుమానాలకు తావిస్తోంది.పులి గొంతు కింద గుచ్చిన గాయం, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం, శరీరమంతా విషంతో నిండి, లివర్‌చెడిపోయి మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. పులి చర్మం, గోర్లు, శరీర భాగాలు రూ.కోట్ల విలువ చేస్తుండటంతో అటవీ సిబ్బందే వన్యప్రాణుల వేటగాళ్లతో చేతులు కలిపి చంపించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే రుద్రవరం సెక్షన్‌లో 4, మిట్టపల్లెలో ఒక ట్రాప్‌ కెమెరాలు మాయమైనట్లు తెలుస్తోంది. బిహార్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతానికి చెందిన వన్యప్రాణుల వేటగాళ్ల పనేనా అనే అనుమానాలు మొదట్లో వినిపించాయి. అటవీ సిబ్బంది వేటగాళ్లతో లాలూచీ పడి చంపించి ఉంటారనే అనుమానాలూ రేకెత్తాయి. అయితే ఆ దిశగా విచారణ చేయకుండా స్థానిక సిబ్బంది అడ్డు పడినట్లు సమాచారం. తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని విచారణాధికారులను తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. అధికారులు కూడా సిబ్బంది చెప్పిన ప్రకారమే తూతూ మంత్రంగా విచారించారు. నీటిలో పడి చనిపోయిందనే కోణంలోనే విచారణ సాగినట్లు సమాచారం. అటవీప్రాంతంలో ఎక్కడెక్కడ పులి పిల్ల తిరిగింది? ఎటువైపు నుంచి వచ్చి చనిపోయిందన్న కోణంలో దర్యాప్తు సాగకపోవడం ఇందుకు నిదర్శనం. కాగా.. గతంలో ఆవుల మందపై పులి దాడి చేసిందని, మరోసారి దాడి చేయకుండా అటవీ సమీప గ్రామాల్లోని ఆవుల పెంపకందారులు మాంసంలో విషం కలిపి పెట్టి దాన్ని చంపి ఉంటారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ దిశగా అధికారులు విచారణ చేపట్టలేదని తెలుస్తోంది.