విజయవాడ, సెప్టెంబర్ 6, (way2newstv.com)
నూతనంగా అమల్లోకి వచ్చిన నూతన ఇసుక పాలసీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. యాప్ పనిచేయకపోవడం, కొన్ని నదుల్లో నీరు ఎక్కువగా ఉండడంతో ఇసుక సరఫరాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని రీచ్‌లు అధికా రికంగా ప్రారంభమైనా ఉపయోగం లేకుండా పోయింది. తమ చేతిలో ఏమీ లేదని, యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలీదని మైనింగ్ శాఖాధికారులు చెబుతున్నారు. నూతన ఇసుక పాలసీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి తొలిరోజే చేతులెత్తేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ గ్రామాల్లో ఇసుక రీచ్‌లు వద్దంటూ పలు ప్రాంతాల్లో అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి.
ఇసుక అక్రమాలకు తెర తీశారా...
గుంటూరు జిల్లాలో 14 రీచ్‌లు ఏర్పాటుకు అధికారులు అనుమతించారు. ఐదు చోట్ల స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలోని రీచ్‌లకు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం బత్తినపాలెంలో స్టాక్ యార్డు ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. అమరావతి మండలం దిడుగులో మూడు, ధరణికోటలో నాలుగు రీచ్‌లు ఈ గ్రామానికి దగ్గరని స్టాక్ పాయింట్ నెలకొల్పారు. కానీ, ఈ గ్రామం నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇసుక చేరవేతకు విజయవాడ మీదుగా వెళ్లి రావాల్సి ఉంది. లేదా అచ్చంపేట మండలం మాదిపాడు ఫంట్ మీదుగా రాకపోకలు చేయాల్సి ఉంటుంది. ఏడు రీచ్‌లకు ఒకేచోట స్టాక్‌యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కృష్ణా జిల్లాలో ఆరు ఇసుక రీచ్‌లకుగానూ చెవిటికల్లు ఇసుక రీచ్ మాత్రమే ప్రారంభమైంది. కృష్ణా నదిలో నీరు ఎక్కువగా ఉన్నందున మిగిలిన ప్రాంతాల్లో రీచ్‌లు ప్రారంభం కాలేదు. కడప జిల్లాలో 12 ఇసుక రీచ్‌లున్నాయి. మొదటి విడత పెద్దశెట్టిపల్లి, ఇండ్లూరు, జ్యోతి, మందరం, బాలరాజుపల్లి ఇసుక రీచ్‌లను ఎంపిక చేశారు. వీటి పరిధిలో నాలుగు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రాజంపేట మండలంలోని పింఛమాంబపురం ఇసుక స్టాక్ పాయింట్‌ను డిప్యూటీ సిఎం అంజాద్‌బాష ప్రారంభించారు. ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె స్టాక్ పాయింట్ కూడా ప్రారంభమైంది. ఐదు ఇసుక క్వారీల్లో తొలిరోజు రెండే ప్రారంభమయ్యాయి. మూడింటిలో నదుల్లో నీటి ప్రవాహం వల్ల ప్రారంభించలేదు. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం నాలుగు ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు, మూడు ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లు గుర్తించారు. బ్రహ్మసముద్రం మండలంలోని కన్నేపల్లి గ్రామంలో ఇసుక రీచ్ ప్రారంభమైంది. ఇంకా అమ్మకాలు జరగలేదు. కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామస్తులు తమ ప్రాంతంలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయద్దంటూ నిరసన తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నెల్లూరులో రీచ్‌లు, ఆరు ఇసుక స్టాక్ పాయింట్లకుగానూ ఒక్కచోట కూడా ఇసుక కొనుగోలు ప్రారంభం కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 18 ఇసుక రీచ్‌లను గుర్తించారు. రెండు, మూడు ఇసుక రీచ్‌లకు ఒకచోట స్టాక్ పాయింట్ల చొప్పున జిల్లాలో ఆరు చోట్ల ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి, ఆమదాలవలస మండలం చవ్వాకులపేట, ముద్దాడపేట, సరుబుజ్జిలి పెద్దసవలాపురం, పురుషోత్తపురం, జలుమూరు మండలం పర్లాం ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింటయ్యాయి. వంశధార, నాగావళి నదుల్లో వరద నీరు భారీగా చేరడంతో నరసన్నపేట మండలం మడపాం వద్ద రీచ్ మాత్రమే నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 11 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఒక్క రీచ్‌లో కూడా అమ్మకాలు ప్రారంభం కాలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో 15 ఇసుక రీచ్‌లకుగానూ వాటిలో పది మాత్రమే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుక చేరవేసే ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో 11 ఇసుక రీచ్‌లను గుర్తించి ఆరింటికి అనుమతి ఇచ్చి వాటిని ప్రారంభించారు. నందవరం మండలం నాగలదిన్నెలో ఒకటి, కౌతాళం మండలం గుడికంబాలిలో మూడు రీచ్‌లు, నదిచాగిలో రెండు రీచ్‌లను ప్రారంభించారు. మొత్తం 2,40,300 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, చిలకలేరు, ముసి, పాలేరు నదుల్లో కొన్ని రీచ్‌లను గుర్తించారు. ముండ్లమూరు, మద్దిపాడు, వేటపాలెం, కందుకూరులలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలో 12 ఇసుక రీచ్‌లకుగానూ ఒక్కటీప్రారంభం కాలేదు. ఒక్క స్టాక్ పాయింట్‌లో ఇసుకను అందుబాటులో ఉంచారు.
Tags:
Andrapradeshnews