యరపతినేని చుట్టూ బిగిస్తున్న ఉచ్చు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యరపతినేని చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

గుంటూరు, సెప్టెంబర్ 7, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? ప్రభుత్వం యరపతినేని మైనింగ్ దందాలపై సీబీఐ విచారణకు రెడీ అవ్వడంతో యరపతినేని శ్రీనివాసరావుకు దిక్కు తోచడం లేదు. న్యాయనిపుణలతో సంప్రదిస్తున్నారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే యరపతినేని శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. దాదాపు ఇరవై అయిదేళ్లుగా గురజాల నియోజకవర్గాన్ని శాసించిన యరపతినేని శ్రీనివాసరావు ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.యరపతినేని శ్రీనివాసరావుపై గత దశాబ్దకాలం నుంచి మైనింగ్ ఆరోపణలున్నాయి. 
యరపతినేని చుట్టూ బిగిస్తున్న  ఉచ్చు

మైనింగ్ వ్యాపారంతోనే ఆయన కోట్లకు పడగలెత్తారన్న విమర్శలూ లేకపోలేదు. మరొకరిని మైనింగ్ వ్యాపారంలో పల్నాడు ప్రాంతంలో యరపతినేని శ్రీనివాసరావు అడుగుపెట్టనివ్వకపోవడం వల్ల కూడా ఆయన శత్రువుల సంఖ్య బాగా పెరిగిందంటారు. ఇసుక, మైనింగ్ తవ్వకాల్లో మరొకరు చేయి వేస్తే ఊరుకునే తత్వం కాదు యరపతినేని. అందుకోసం ఆయన వర్గం ఎంతకైనా తెగిస్తుందంటారు. గతఎన్నికల్లోనూ యరపతినేని శ్రీనివాసరావుపై ఇదే ప్రధాన ఆరోపణలను వైసీపీ అస్త్రాలుగా మలచుకుంది.యరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గంలో పట్టున్న నేత. ఇప్పటికీ ఆయనకు కావాల్సినంత బలముంది. 1994, 2009, 2014 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. 1999లో ఎలా ఉన్నా 2009 నుంచే యరపతినేని దందా స్టార్టయిందంటారు అక్కడి నేతలు. 2009, 2014లో వరసగా గెలవడం, 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో యరపతినేని శ్రీనివాసరావును ఇక అడ్డుకునే వారు లేకుండా పోయారు. దీంతో ఆయన చిన్న వ్యాపారులను కూడా ఎదగనివ్వలేదన్న టాక్ గురజాల నియోజకవర్గంలో బలంగా విన్పిస్తుంది.యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు ప్రాంతంలో ఉన్న మైనింగ్ ను దేనినీ వదలేదంటారు. కేశానుపల్లి, కొండమోడు, పిడుగురాళ్ల,నడికుడి దాచేపల్లి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కు ఆయన పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీబీసీఐడీ సయితం నిర్ధారించింది. ప్రాధమిక ఆధారాలు కూడా లభ్యం కావడంతో ఏపీ ప్రభుత్వం యరపతినేని అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. ఇలా దశాబ్దాల కాలం పాటు ఒక వెలుగువెలిగిన యరపతినేని శ్రీనివాసరావు సీబీఐ విచారణకు సిద్ధం కావాల్సిందే.