బాబుకు తలనొప్పిగా మారుతున్న పర్యటనలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాబుకు తలనొప్పిగా మారుతున్న పర్యటనలు

కాకినాడ, సెప్టెంబర్ 7, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన ఆయనకు తలనొప్పి తెచ్చేలా ఉంది. చంద్రబాబునాయుడు క్యాడర్ లో ధైర్యం నింపేందుకు జిల్లాల పర్యటనను ఎంచుకున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోయారు. అయితే దీని నుంచి వారిని బయటపడేసేందుకు చంద్రబాబు జిల్లాల పర్యటనను ఎంచుకున్నారు. అయితే పార్టీలో నెలకొన్న విభేదాలు, ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు చంద్రబాబు కు ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.చంద్రబాబునాయుడు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు పర్యటనలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. 
బాబుకు తలనొప్పిగా మారుతున్న పర్యటనలు

రోజుకు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష చేస్తూ గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఆయన విశ్లేషిస్తున్నారు. అలాగే వందరోజుల జగన్ పాలనలో తప్పులను కూడా చంద్రబాబు సమీక్షల్లో ఎండగడుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ సమీక్షలను కొందరు టీడీపీ నేతలు లైట్ గా తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన నేతలు చంద్రబాబు సమీక్ష కు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన మాగంటి రూప, చలమలశెట్టి సునీల్ హాజరు కాలేదు. వీరిలో తోట త్రిమూర్తులకు స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి సమీక్షకు హాజరు కావాల్సిందిగా కోరినా ఆయన రాకపోవడం విశేషం.ఎన్నికల సమయంలో తమకు నిధుల పంపిణీ విషయంలో పార్టీ పక్షపాతం చూపిందని గత కొంతకాలంగా టీడీపీ కాపు నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీలో ఒక ముఖ్యనేత తమకు నిధులు ఎక్కువ ఇవ్వకుండా చేశారని గతంలో చంద్రబాబుకే వారు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఇతర పార్టీల్లోకి మారేందుకు కూడా తోట త్రిమూర్తులు లాంటి వారు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే వారు చంద్రబాబు స్వయంగా జిల్లాకు వచ్చినా హాజరు కాలేదు. మొత్తం మీద చంద్రబాబు జిల్లాల పర్యటనలో నేతల అసంతృప్తి బహిర్గతం కానుండటంతో పార్టీలో ఒకింత ఆందోళన నెలకొంది.