విజయవాడ, సెప్టెంబర్ 28, (way2newstv.com)
ఈ ఏడాది ఖరీఫ్‌లో గడచిన నాలుగేళ్లల్లోకెల్ల కనిష్ట వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా జూన్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఖరీఫ్ సీజను. వ్యవసాయానికి ఇదే అత్యంత ప్రధానమైంది. మరో రెండు రోజుల్లో ఖరీఫ్ గడువు ముగుస్తోంది. సీజను సాధారణ వర్షపాతం 556 మిల్లీమీటర్లు. నాటికి చూసుకుంటే 533 మీమీ పడాలి. కాగా 499 మీమీ పడింది. సాధారణ వర్షంలో సుమారు 16 శాతం తక్కువ కురిసింది. ఇదే సమయానికి 2015లో 515 మిమీ, 2016లో 524.6 మిమీ, 2017లో 545.5 మిమీ వర్షం కురిసింది. వరుసగా నాలుగేళ్లల్లో ఈ మారు కనిష్ట వర్షం నమోదైంది.
40 మండలాల్లో వానలు తక్కువే
రాష్ట్ర విభజన అనంతరం తొలి ఏడాది 2014లో మాత్రం 372.7 మీమీ కురిసింది.ఈ తడవ నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. జూన్ 4న రాయలసీమలోకి అదే నెల 9వ తేదీకి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. తొలకరి వానల తర్వాత రుతుపవనాలు మురాయించాయి. తిరిగి జూన్ నెలాఖరులో కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపాయి. మొత్తమ్మీద ఖరీఫ్‌లో ఉభయగోదావరి, కృష్ణా ఈ మూడు జిల్లాల్లోనే ఆశాజనకంగా వానలు కురిశాయి. కొంత విరామం తర్వాత శ్రీకాకుళం, విశాఖపట్నంలో వర్షాలు పడగా ఎప్పటికో విజయనగరం, గుంటూరు జిల్లాలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి.సీజను మొదటి నుంచీ రాయలసీమ నాలుగు జిల్లాలు, దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు వెరసి ఆరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. ఇప్పటికీ ఆ జిల్లాలు తేరుకోలేదు. ప్రస్తుతం గుంటూరు సైతం తక్కువ వర్షం కురిసిన జాబితాలో చేరింది. సెప్టెంబర్ 26 నాటికి మొత్తం ఏడు జిల్లాల్లో తక్కువ వర్షం నమోదైంది. మొన్నటి వరకు కడప జిల్లా అత్యత్యల్ప వర్షం కురిసిన కేటగిరీలో ఉండగా రెండు మూడు రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వానలతో తక్కువ వర్షం కురిసిన జాబితాలోకొచ్చింది. జులై నెలాఖరు వరకు నమోదైన వర్షపాత గణాంకాల ఆధారంగా సర్కారు ఆరు జిల్లాల్లోని 296 మండలాల్లో కరువును ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 360 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదుకాగా వాటిలో 40 మండలాల్లో అత్యల్ప వర్షం కురిసింది.