గుంటూరు, సెప్టెంబర్ 27, (way2newstv.com)
ఆమె మొదటి సారి ఎమ్మెల్యే. వైద్య వృత్తిలో ఉండి రాజకీయాల్లోకి వచ్చారు. పట్టుమని ఎమ్మెల్యే అయి మూడు నెలలు కూడా గడవక ముందే డిక్టేటర్ గా మారారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఏం జరగకూడదన్న శాసనాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తలనొప్పిగా మారింది. ఆమే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. వరసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే శ్రీదేవికి పార్టీ నేతలే శత్రువులు. వారినే ఆమె టార్గెట్ చేస్తుండటం విశేషం.సహజంగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అందరినీ కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననలను పొందాలని ప్రయత్నిస్తారు.
పార్టీకి తలనొప్పిగా మారిన ఉండవల్లి శ్రీదేవి
అలాగే సొంత పార్టీ నేతలతో సఖ్యతగా ఉంటూ ప్రతి రోజూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతారు. కానీ డాక్టర్ అయిన శ్రీదేవికి రాజకీయాలు పెద్దగా అబ్బినట్లు లేదు. ఆమె ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవిని ఆశించారు. జగన్ కుటుంబ సభ్యుల సిఫార్సుతో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఏకంగా మంత్రి అవ్వాలని భావించిన శ్రీదేవి ఆ పదవి తనకు రాకుండా చేసిన వారిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.ముందు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో వివాదం తలెత్తింది. తనకు తెలియకుండా నందిగం సురేష్ మనుషులు ఇసుక తవ్వకాలను జరుపుతున్నారని స్థానిక పోలీసులకు ఉండవల్లి శ్రీదేవి ఫిర్యాదు చేశారు. నందిగం సురేష్ అనుచరులను అరెస్ట్ చేయించారు. దీంతో సురేష్ వారి అనుచరులను విడిపించుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ ఇసుక వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవినీతిని సహించనని జగన్ ఒకవైపు చెబుతుంటే ఇసుక కోసం సొంత పార్టీ ఎంపీతోనే గొడవ పెట్టుకోవడంతో నేరుగా జగన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఇక ఇటీవల వినాయక మండపంలో తనను అవమానపర్చారంటూ కొందరిపై కేసులు పెట్టించారు ఉండవల్లి శ్రీదేవి. తాజాగా ఒక మసీదు శంకుస్థాపన కోసం అక్కడి పెద్దలు చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీని ఆహ్వానించారు. ఈకార్యక్రమానికి ఉండవల్లి శ్రీదేవిని ఆహ్వానించినప్పటికీ తన నియోజకవర్గంలో ఇతర ఎమ్మెల్యేల జోక్యమేంటని ఉండవల్లి శ్రీదేవి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇలా ఏ ఎమ్మెల్యేతోనూ ఉండవల్లి శ్రీదేవికి పడటం లేదు. ఉండవల్లి శ్రీదేవిపై ఇప్పటికే వైఎస్ జగన్ కు అనేక ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోనే ఉండే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని సొంతపార్టీ నేతలే అంటుండటం విశేషం