గ్యాస్ దందా.. (నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్యాస్ దందా.. (నిజామాబాద్)

నిజామాబాద్‌, సెప్టెంబర్ 19 (way2newstv.com): 
జిల్లాలో ‘డెమెస్టిక్‌’ గ్యాస్‌ సిలిండర్ల దందా కమర్షియల్‌గా సాగుతోంది. గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌లు యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యాపారం ప్రధానంగా నిజామాబాద్‌ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్‌ లాంటి పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్‌ సెంటర్‌లలో ఇంటి సిలిండర్‌లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండడంతో పాటు కొంత మంది ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారిపోయింది. అయితే డొమెస్టిక్‌ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిరంతరంగా తనిఖీలు చేయాల్సిన సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఇటీవల కాలంలో తనిఖీలు చేయడం మానేశారు. 
గ్యాస్ దందా.. (నిజామాబాద్)

ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్‌ సిలిండర్‌లు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. అయితే చాలామట్టుకు ఆ నిబంధనలను పాటించడం లేదు. ఎందుకంటే 19 కిలోలు గల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ప్రసుతం రూ.1400 వరకు ఉంది. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ 14.6 కిలోలు ఉండి దాని విలువ రూ.670 వరకు ఉంది. ఈ లెక్కన కమర్షియల్‌ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్‌ సిలిండర్‌లు కొనుగోలు చేయవచ్చు. గ్యాస్‌ కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో హోటళ్లలో, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల నిర్వాహకులు ఇది తప్పని తెలిసినా డొమెస్టిక్‌ గ్యాస్‌ను వినియోగించడానికి వక్ర మార్గాన్ని ఆచరిస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీలను మచ్చిక చేసుకుని డొమెస్టిక్‌ సిలిండర్‌లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్‌ ఏజెన్సీలకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు లాభం రావడంతో ‘డొమెస్టిక్‌’ దందా ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’గా మారింది. ఇటు సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఏజెన్సీలతో మిలాఖత్‌ అయ్యారనే ఆరోపణలున్నాయి. అందుకే వీరి డొమెస్టిక్‌ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.  జిల్లాలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సింగిల్‌ కనెక్షన్‌లు సుమారు 2లక్షల 7వేల వరకున్నాయి. డబుల్‌ కనెక్షన్‌లు లక్షా 19వేల వరకు, దీపం కనెక్షన్‌లు 79వేల వరకు, సీఎస్‌ఆర్‌ కనెక్షన్‌లు 28,500 వరకు ఉన్నాయి. సిలిండర్‌లను సరఫరా చేసేందుకు ఇండియన్, హెచ్‌పీ, భారత్‌ కలిపి గ్యాస్‌ ఏజెన్సీలు 35 వరకు ఉన్నాయి. అయితే కమర్షియల్‌ సిలిండర్లు మాత్రం 3,400 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా అంతటా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, టిఫిన్‌ సెంటర్‌లు, ఇతర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్‌ సిలిండర్లు హోటళ్ల సామర్థ్యం ఆధారంగా వారం ఒకటి నుంచి రెండు, మరి కొన్నింటిలో నెలకు ఐదు వరకు వినియోగం అవుతున్నాయి. ఒక కమర్షియల్‌ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. ఈ సందర్భంగా డొమెస్టిక్‌ సిలిండర్‌లను అక్రమంగా వినియోగిస్తున్నారు. కార్లు, ఇతర వాహనాల్లో కూడా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌లు ఎక్కిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గృహావసరాలకు వినియోగించే సిలిండర్లు పక్కదారి పడుతున్నా అధికారులు మాత్రం ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.