సీమలో కరువు కరాళ నృత్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీమలో కరువు కరాళ నృత్యం

కర్నూలు, సెప్టెంబర్ 20, (way2newstv.com)
రాయలసీమ కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ప్రతి మూడేళ్లలో రెండేళ్లు కరువు కరాళనృత్యం చేస్తూనే ఉంది. ఈ ఏడాదీ అదే దుస్థితిఅన్నదాత మరోసారి ఓడిపోతున్నాడు. కోటి ఆశలతో ఖరీఫ్‌కు శ్రీకారం చుడితే.. మొదట్లో మురిపించిన వరుణుడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. వర్షాలు లేక పంటలు ఎండుముఖం పట్టాయి. ఇప్పటికే దాదాపు పూర్తిగా ఎండిపోయాయి. సాగు కోసం వేలాది రూపాయలు అప్పు చేసి ఖర్చుపెడితే పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదు. రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోతుండడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. . ఖరీఫ్ ప్రారంభంలో మురిపించిన వరుణుడు తర్వాత ముఖం చాటేయడంతో వేసిన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. వర్షాలపై ఆధారపడి వేరుశెనగ సాగుచేసిన రైతులు నిండి మునిగిపోయారు. 
సీమలో కరువు కరాళ నృత్యం

పెట్టిన పెట్టుబడిలో పైసా కూడా వెనక్కు వచ్చే పరిస్థితి లేదు. విత్తనాలు వేసి 90 రోజులు  కావస్తున్నా.. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. ఈ సమయానికి కాయలు కాసి, ఏపుగా పెరగాల్సిన వేరుశెనగ పంట మొలక దశ నుంచే ఎండిపోతోంది. రైతులకు కనీసం పశుగ్రాసం కూడా లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు రైతులు పంటను దున్నేస్తున్నారు. ఇప్పుడు వర్షం పడినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. దిగుబడి సంగతి అటుంచి, పశుగ్రాసం కూడా దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిలో నుంచి వేరుశెనగ చెట్లను తొలగించడానికి అయ్యే ఖర్చు కూడా తిరిగిరాదని, పంటను వదిలేయడం మినహా మరో మార్గం లేదని, పశువులను అమ్ముకునే పరిస్థితి వస్తుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. వర్షాలపై ఆధారపడి రైతన్నలు ప్రధానంగా సాగుచేసే వేరుశెనగ పంట ఎండిపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.రాయలసీమలో సుమారు 17.20 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 5.90, అనంతపురం జిల్లాలో 7.40, కడప జిల్లాలో 1.36, చిత్తూరు జిల్లాలో 2.54 లక్షల హెక్టార్లు ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 4.64, అనంతపురం జిల్లాలో 4.04, కడప జిల్లాలో 0.92, చిత్తూరు జిల్లాలో 1.47 లక్షల హెక్టార్లలో వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, జొన్న, సజ్జ తదితర మెట్ట పంటలు సాగుచేశారు. సాగు కోసం ఎకరాకు సగటున రూ.8 వేల చొప్పున ఖర్చుపెట్టారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అన్నదాతలు కోటి ఆశలతో ఖరీఫ్‌కు శ్రీకారం చుట్టారు. సాగు ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తల తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుని సాగుకు దిగారు. రైతులకు ఆశ కల్పించేలా వరుణుడు మొదట్లో మురిపించాడు. సీమ మొత్తం విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగుకు దిగారు. సీమ మొత్తం 17.20లక్షల హెక్టార్లలో వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, సజ్జ, జొన్న తదితర పంటలు సాగు చేశారు. ఆ తర్వాతి నుంచి వర్షపు చుక్క కనిపిస్తే ఒట్టు. భూగర్భజలాలు కూడా పూర్తిగా అడుగంటి పోయాయి. వేసిన పంటలు ఎండిపోయాయి. కడప, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, డోన్, ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పంటలు ఎండిపోయి.. రైతులు పొలాలను దున్నేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం నేలపాలైంది.రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది వర్షపాతం లోటు తీవ్రంగా ఉంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు పరిశీలిస్తే.. పరిస్థితి అర్థం అవుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కొంత తక్కువ లోటున్నా.. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మరీ ఎక్కువ లోటుంది. కడప జిల్లాలో మూడు నెలలకు సాధారణ సగటు వర్షం 288.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే.. 112.3 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే సగటున 61.0 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉంది. అలాగే అనంతపురం జిల్లాలో 229.8 మిల్లీమీటర్లకు గాను 117.6 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 48.8లోటు వర్షపాతం నమోదైంది. అలాగే చిత్తూరు జిల్లాలో 331.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 168.8 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 45.8 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. ఇక కర్నూలు విషయానికి వస్తే.. సాధారణ వర్షపాతం 418.2 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. కానీ 366.7 మిల్లీమీటర్ల వర్షంమే కురిసింది. 51.5 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. ప్రతి జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు వర్షాలు కురిసినా ఉపయోగం లేదని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాల్సిందేనని రైతులు చెబుతున్నారు.