జ్వరాల పంజా (చిత్తూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జ్వరాల పంజా (చిత్తూరు)

చిత్తూరు, సెప్టెంబర్ 23 (way2newstv.com): 
పల్లె.. పడకేసింది. ఊరూరా వ్యాధులు విజృంభిస్తున్నాయి. వానాకాలం తోడు పారిశుద్ధ్య లోపం.. పాలకుల నిర్లక్ష్యం వెరసి.. డెంగీ, విష జ్వరాలతో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న ఓపీల్లో అత్యధికం జ్వరాలకు సంబంధించినవే. వ్యాధుల బారిన పడుతున్న వారిలో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా ఉండొచ్చని తెలిసింది. జిల్లా ప్రజలు కొద్ది రోజులుగా డెంగీ, మలేరియా, విషజ్వరాలతో వణికిపోతున్నారు. వర్షాలకు తోడు పారిశుద్ధ్య లోపంతో పల్లెలు, పట్టణాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయి. తిరుపతి, పలమనేరు, మదనపల్లె, కుప్పం, నగరి, బంగారుపాళెంలో విషజ్వరాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. 
జ్వరాల పంజా (చిత్తూరు)

తిరుపతి గ్రామీణం మల్లంగుంట, మంగళం ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులు డెంగీతో చనిపోగా.. ఇప్పటివరకు ఆ ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి పరిసరాలను శుభ్రం చేసిన దాఖలాలు లేవు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఒక్కరూ అవగాహన కల్పించలేదు. డెంగీ జ్వరాన్ని నిర్ధారించే ఆసుపత్రులు జిల్లాలో కేవలం రెండే ఉన్నాయి. అవి తిరుపతిలోని స్విమ్స్‌, రుయా ఆస్పత్రి. ప్రైవేటు వైద్యశాలల్లో వీటిని నిర్ధారించే పరికరాలు ఉన్నా.. అవి కచ్చితంగా ఫలితం ఉండడం తక్కువని వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీని నిర్ధారించే పరీక్షలు నిర్వహిస్తే దూర ప్రాంత ప్రజలకు సమస్యలు ఉండవు. జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కుప్పంలో నెల రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిలిచిపోయాయి. దాంతో పేదలు ప్రైవేటు ల్యాబ్‌లలో రూ.800- రూ.1000 వెచ్చించి పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవలే ఇక్కడ పరీక్షలు పునః ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించే మెడాల్‌ సంస్థ పీలేరు, మరికొన్ని ఆసుపత్రుల్లో సేవలు నిలిపేసింది.బంగారుపాళ్యం మండలంలోని తగ్గువారిపల్లె, ఎగువకంతలచెరువులో సుమారు 50 మందికి జ్వరాలు సోకాయి. మండలంలో నలుగురుకి డెంగీ వచ్చింది. వీరిలో ఇద్దరు వేలూరు సీఎంసీలో, మరో ఇద్దరు తిరుపతి రుయా, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తగ్గువారిపల్లె, ఎగువకంతలచెరువు గ్రామాల్లో ఇంటికి ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో బాధ పడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతోనే జ్వరాలు సోకుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు.