ట్రెడిషనల్ పాలిటిక్స్ కు దూరంగా కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ట్రెడిషనల్ పాలిటిక్స్ కు దూరంగా కేసీఆర్

హైద్రాబాద్, సెప్టెంబర్ 10, (way2newstv.com)
కేసీఆర్ రాజకీయ వ్యూహకర్తగా పేరు గడించారు. ఎంతలా అంటే కాదన్న వారిచేత అవుననిపించుకునే నైపుణ్యం ఆయన సొంతం. లేకపోతే సంకీర్ణ యుగంలోనే తెలంగాణా సాధ్యమని ఎలా ఆలోచన చేయగలరు, పైగా ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణా రాష్ట్రం సాధించి అసాధ్యం సుసాధ్యం చేశారు. ఢిల్లీతో కూడా ఎపుడు స్నేహం చేయాలో ఎపుడు దూరంగా ఉండాలో కూడా కేసీఆర్ కి తెలుసు. అయితే కేసీఆర్ తాజాగా ఎన్నికల ముందు మాత్రం కొంత దెబ్బ తిన్నారు. ఆయన అంచనాలు తప్పడమే ఇందుకు కారణం. ఢిల్లీలో సంకీర్ణ సర్కార్ వస్తుంది, చక్రం తిప్పుదామని భావించిన కేసీఆర్ కి బీజేపీ అజేయమైన విజయంతో దూసుకురావడం మింగుడుపడడంలేదు. 
ట్రెడిషనల్ పాలిటిక్స్ కు దూరంగా కేసీఆర్

అంతే కాదు తెలంగాణాలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని కాషాయం పార్టీ తొడకొట్టడం కూడా కంట్లో కునుకు లేకుండా చేస్తోంది.ఇది బాగా ఇబ్బంది పెడుతోంది. ఉద్యకారుడు నుంచి ఫక్తు రాజకీయ నేత అవతారం ఎత్తాక కేసీఆర్ లో చాలా మార్పు వచ్చేసింది. ఆయన కూడా ట్రేడిషనల్ పాలిటిక్స్ కి అలవాటు పడ్డారు, పైగా కొడుకు, కూతురు, అల్లుడు అందరిదే పార్టీలో హవా. దానికి తోడు, సామాజిక సమీకరణలను సైతం కేసీఆర్ లెక్క చేయకపోవడం, తెలంగాణా జాతిపితగా తనను తాను ఊహించుకోవడంతో ఆయన మీద అనేక బాణాలు గురి చూసి మరీ దూసుకువస్తున్నాయి. కాంగ్రెస్ పని దేశంలో అయిపోయినా తెలంగాణా వరకూ కాస్తా నోరుంది. దాంతోనే ఇబ్బందిపడుతున్న కేసీఆర్ కి ఇపుడు పులి మీద పుట్రలా బీజేపీ టార్గెట్ చేయడంతో తట్టుకోలేక‌పోతున్నారు. బయటకు బీజేపీది ఏముంది, అసెంబ్లీలో ఒక్క సీటు, గాలిలో ఎంపీలు గెలిచారు అని అనవచ్చు గాక కానీ జరుగుతున్న పరిణామాలు, మారుతున్న రాజకీయ గాలి ఆయనకు తెలియకుండా ఉండవు కదా. అందుకే కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు.ఇలా బీజేపీ పెట్టిన గవర్నర్ గా తమిళ్ సై సౌందర్యరాజన్ వచ్చారో లేదో కేసీఆర్ తనదైన మార్క్ చూపించారు. నిన్నటి బీజేపీ నేత, నేటి గవర్నర్ అయిన తమిళి ఇ సై చేతుల మీదుగానే మంత్రుల చేత ప్రమాణం చేయించి తనదైన సందేశాన్ని ఢిల్లీకి పంపారు. కేసీఆర్ పట్ల అసంత్రుప్తిగా ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో మేనల్లుడికి తిరిగి మంత్రి కుర్చీ ఇచ్చేశారు. కొడుకుకు కూడా పట్టం కట్టారు. ఇక కీలకమైన ఆర్థిక శాఖను హరీష్ కి అప్పగించారు. ఈ మధ్య కాస్తా గడబిడ చేసిన ఈటెల రాజెందర్ ను పిలిపించుకుని మరీ మాట్లాడారు. అంతటితో ఆ వ్యవహారాన్ని సర్దుబాటు చేసుకున్నారు. అన్ని సామాజికవర్గాల సమతూకం పాటిస్తూ పూర్తి స్థాయిలో మంత్రులతో కొలువు తీరారు. ఎక్కడా పైకి అసమ్మతి మాట వినిపించకుండా కట్టడి చేసుకోగ‌లిగారు. మొత్తానికి టీఆర్ఎస్ కోటకు చిన్న రంద్రమైనా కూడా రాకుండా లేకుండా కేసీఆర్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరి బీజేపీకి కేసీఆర్ భయపడ్డారా. తన వ్యూహాలతో భయపెట్టాలనుకున్నారా. చూడాలి మరి.