జగన్ తో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ తో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

విజయవాడ, సెప్టెంబర్ 13  (way2newstv.com)
ఏపీ సచివాలయంలో ఈ మధ్యాహ్నం నీతి అయోగ్ బృందం ఏపీ సీఎం జగన్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఏపీ అధికారులు వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పలు రంగాల వారీగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. భేటీ అనంతరం నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర రెవెన్యూ కాస్త ఆందోళనకరంగా ఉందని, బడ్జెట్ ను దాటి ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని వెల్లడించారు.రాష్ట్రంలో పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. 
జగన్ తో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని, మహిళా శిశుసంక్షేమంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (పెట్టుబడి రహిత ప్రకృతి వ్యవసాయం)ను ప్రోత్సహించాలని రాజీవ్ కుమార్ సూచించారు. నవరత్నాలు పథకాలపై సీఎం వివరించారని తెలిపారు. సీఎం జగన్ ఆలోచన, విజన్, ప్రణాళికలు చాలా బాగున్నాయంటూ ఆయన కితాబిచ్చారు.అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుండేలా తోడ్పాటు అందిస్తామని, మానవాభివృద్ధి సూచికలను మరింత పెంచేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్ లో సగానికి పైగా మానవ వనరుల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు అమలుపై చర్చిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత అమరావతిలోని పెట్టుబడి అవసరం లేని ప్రకృతి సాగు క్షేత్రాలను (జీరో బడ్జెట్ నేచురల్‌ ఫార్మింగ్) రాజీవ్ కుమార్ పరిశీలించనున్నారు.