ప్రైవేట్ కు పట్టని నో స్కూల్ బ్యాగ్ డే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రైవేట్ కు పట్టని నో స్కూల్ బ్యాగ్ డే

కాకినాడ, సెప్టెంబర్  12, (way2newstv.com)
‘నో...స్కూల్‌ బ్యాగ్‌ డే’ పాటించాలని మూడు నెలల ముందే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా బే ఖాతరంటూ ప్రయివేటు పాఠశాలలు తమ పాత దారిలోనే నడుస్తున్నాయి. యథేచ్ఛగా ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బండెడు పుస్తకాల బరువుతో చిన్నారులు పడుతున్న కష్టాలను ప్రజాసంకల్ప యాత్రలో  చూసి చలించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక ‘నో బ్యాగ్‌ డే’ అమలుకు శ్రీకారం చుట్టారు. 
ప్రైవేట్ కు పట్టని నో స్కూల్ బ్యాగ్ డే

ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు నెలలో మొదటి, మూడో  శనివారం దీనిని కచ్చితంగా అమలు చేయాలని జూలై నెలలో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటా అమలుకు ఆదేశాలు వచ్చాయి. కేవలం పుస్తకాలకే పరిమితమైపోతున్న విద్యార్థులలో మానసిక ఒత్తిడిని దూరం చేసి సృజనాత్మకతను వెలికితీయాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నిర్వాకంతో అటకెక్కుతోంది. ప్రైవేటు యాజమాన్యాల్లో నడుస్తున్న పాఠశాలలపై నిఘా పెట్టగా డొల్లతనం బట్టబయలైంది.‘నో బ్యాగ్‌ డే’ పేరుతో ఆనంద పాఠాలు బోధించేలా ప్రణాళికను ప్రభుత్వం  రూపొందించింది. ఉదయం నాలుగు తరగతుల్లో నీతి కథల బోధన, చిత్రలేఖనం, నైతిక విలువలు, సేవా కార్యక్రమాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. అనంతరం క్రీడలు, యోగాసనాలపై శిక్షణ ఇవ్వాలి. కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్, సరదాగా ఆటలు ఆడించాలి. అలాగే పాఠశాలలో సాగు చేస్తున్న బడితోటలో పాదులు వేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం వంటి వాటిని అలవాటు చేయాలి. గ్రంథాలయాల్లో పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం, వాటిపై చర్చించే అంశాలు నేర్పించాలి. ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపల్, వ్యవసాయదారులు, తదితర పెద్దలను పిలిచి పిల్లలతో మాట్లాడించాలి. 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్‌) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన మండలి సూచనల ప్రకారం 1, 2 తరగతులకు భాష, గణితం, 3, 4 తరగతులకు సామాన్య శాస్త్రం, గణితం తప్ప ఇతర సబ్జెక్ట్‌ పుస్తకాలు ఉండకూడదు. అదనపు పుస్తకాలు తీసుకు రావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు. అదనపు మెటీరియల్‌ ఇచ్చినా అవన్నీ కలిపి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించిన పుస్తకాల బరువును మించకూడదు.  వీటిని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు.