ముంబై, అక్టోబరు 18, (way2newstv.com)
బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా మార్చాలనే మోదీ ప్రభుత్వపు నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె బాట పడుతున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. ఈ సమ్మెలో ఏకంగా 2 లక్షలకు పైగా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొనవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.విలీన ప్రక్రియ ప్రైవేటీకరణకు దారితీస్తుందనే విషయాన్ని తాము అర్థం చేసుకోగలమని, అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ) తెలిపింది. అందుకే అక్టోబర్ 22న సమ్మెకు దిగుతున్నామని పేర్కొంది.
అక్టోబరు 22న బ్యాంక్ సమ్మె
ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కూడా సమ్మెకు మద్దతు తెలిపింది.బ్యాంకుల విలీనం వల్ల పెద్ద సంఖ్యలోనే బ్రాంచులు మూతపడతాయని, దీంతో స్టాఫ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని, అప్పుడు ఉద్యోగాల కోత ప్రారంభమౌతుందని బీఈఎఫ్ఐ తెలిపింది. మొండి బకాయిలను వసూలు చేయడం, డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం, కస్టమర్లపై చార్జీల బాదుడు తగ్గింపు వంటి పలు అంశాలను కూడా యూనియన్లు వాటి డిమాండ్లలో చేర్చాయి.బ్యాంక్ స్ట్రైక్ వల్ల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ రెగ్యులేటరీకి తెలియజేసింది. అయితే బ్యాంక్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని పేర్కొంది. సమ్మెలో పాల్గొంటున్న యూనియన్లలో తమ సిబ్బంది తక్కువ మందే ఉన్నారని, దీంతో బ్యాంకింగ్ సేవలపై పెద్దగా ప్రభావం ఉండబోదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపిందిబ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. కాగా కేంద్ర ప్రభుత్వం దేశీ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆగస్ట్ నెలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియను ప్రకటించింది. దీంతో దేశంలో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు దిగిరానుంది.