పత్రాలను అందజేసిన మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట, అక్టోబరు 22 (way2newstv.com):
ఐక్యమత్యంతో మెదిలి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేద్దాం. ఇందు కోసం మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని నూతనంగా ఏర్పాటైన నారాయణరావు పేట మండలం ఆదర్శంగా రూపుదిద్దుకోవాలని ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో మంగళవారం మధ్యాహ్నం నారాయణరావు పేట మండలంలోని 10 గ్రామాలకు ప్రతి గ్రామానికి రూ.50లక్షల చొప్పున మొత్తం మండలానికి రూ.5కోట్ల రూపాయల మంజూరు పత్రాలను ప్రజా ప్రతినిధులు, యువత, గ్రామస్తులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
అభివృద్ధి పనులకు రూ.50లక్షల చొప్పున మంజూరు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఏం కేసీఆర్ సొంతూరు చింతమడక పర్యటనలో భాగంగా సిద్ధిపేట నియోజకవర్గంపై ప్రేమతో అన్నీ గ్రామాల అభివృద్ధి జరగాలని ప్రత్యేక చొరవ చూపి ఈ నిధులను విడుదల చేశారని చెప్పారు. కొత్తగా ఏర్పడిన నారాయణరావు పేట మండలంలోని గ్రామాలన్నీ ఆదర్శ గ్రామలుగా తయారు కావాలని స్థానిక ప్రజా ప్రతినిధులను కోరారు. దశల వారీగా గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.50లక్షల నిధుల కేటాయింపు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మండల ఏంపీపీ బాలమల్లు, మండలంలోని వివిధ గ్రామాలకు మంత్రి సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.