విజయవాడ, అక్టోబరు 19 (way2newstv.com)
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో మాదిరిగా నవంబర్ 1న నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆరోజు కార్యక్రమాల నిర్వహణపై ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. ఏపీ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరపాలో తెలియజేయాలని కేంద్ర హోం శాఖను ఆయన కోరారు.
నవంబర్ ఒకటినే ఆంధ్రా అవతరణం
దీనిపై కేంద్ర హోం శాఖ స్పందించి, ఏపీ ఒరిజినల్ బ్రాండ్ ఇమేజ్ కోల్పోకుండా ఉండేందుకు గతంలో మాదిరిగా నవంబర్ 1నే అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని సూచించింది. దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీనే దినోత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపింది. అయినా అప్పటి ప్రభుత్వం ఐదేళ్లపాటు రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. దాని స్థానంలో జూన్ 2 నుంచి వారం రోజులు నవ నిర్మాణ దీక్షలు నిర్వహించింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రావతరణ దినోత్సవ నిర్వహణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నవంబర్ 1నే ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో, నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్ ఈ సమావేశంలో చర్చించనున్నారు.