విజయవాడ, అక్టోబరు 15, (way2newstv.com)
అధికార వైసీపీలో ఒక ఎమ్మెల్యే ఆధిపత్యం కోసం తోటి ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకుంటాడు. మరో ఎమ్మెల్యే కుమారుడు అధికారులపైనే చెప్పులు విసురుతాడు.. అయినా సదరు ఎమ్మెల్యే తేలుకుట్టినట్టు వ్యవహరిస్తాడు. ఇంకో ఎమ్మెల్యే మాది ఇష్టారాజ్యం.. మీకు కూడా సున్నం వేస్తాం.. ఏం చేస్తారో చేసుకోండని రుసరుస లాడతాడు.. వీరందరికీ భిన్నంగా మరో ఎమ్మెల్యే నోటికి, చేతికి కూడా పని చెబుతూ.. నిత్యం వివాదాల్లో కూరుకుపోతున్నాడు. మరి 151 మంది ఎమ్మెల్యేల్లో.. ఆ నలుగురు మాత్రమే ఎందుకు ఇలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు రెచ్చిపోతున్నారు?అసలు ఈ ఎమ్మెల్యేల మితిమీరిన దూకుడు వెనుక ఉన్న అసలు వాస్తవం ఏంటి? అనే చర్చ జోరుగా నడు స్తోంది.
విషయంలోకి వెళ్తే.. వైసీపీకి అఖండ మెజారిటీ వచ్చింది. అయితే, ఈ ఆనందాన్ని ఆశ్వాదించే లోపే.. పార్టీలో ఎమ్మెల్యేల తీరు తీవ్ర వివాదాస్పదం అవుతుండడం, విపక్షాలకు అస్త్రాలను అందించడం వంటివి అధికార పార్టీ సానుభూతి పరులను తీవ్రంగా వేధిస్తోంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కుటుంబం.. పోలీసులపై రెచ్చిపోయింది. ఏకంగా ఆయన కుమారుడు సీఐపై చేయి చేసుకున్నాడు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో అతడిని అరెస్టు కూడా చేశారు.ఇక, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్.. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ టార్గెట్‌గా రెచ్చిపోయాడు. పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేస్తున్నారెందుకు? అని ప్రశ్నించిన ఆయనపై ఒకరకంగా జులుం ప్రదర్శించాడు. మీకు, మీ ఇంటికి చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు పూస్తామంటూ వ్యాఖ్యానించారు. ఇక, కాకాణి, వర్సెస్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల పరిస్థితి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు సొంత పార్టీ ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా విపక్ష పార్టీ ఎమ్మెల్యేల మాదిరిగా వ్యవహరించారన్న విమర్శలు ఆ పార్టీ నేతల్లోనే ఉన్నాయి. కోటంరెడ్డి తన అరెస్టు వెనక కాకాణి హస్తం ఉందన్నట్టుగా మాట్లాడేశారు.ఇలా వీరంతా రెచ్చిపోవడానికి కారణం ఏంటి ? అందరూ సైలెంట్‌గా ఎవరి పని వారు చేసుకుంటూ పోతూంటే.. వీరు మాత్రం రెచ్చిపోతున్నారు. దీంతో వీరంతా కూడా మరో రెండు సంవత్సరాల్లో జరిగే.. మంత్రి వర్గ విస్తరణలో చోటు సంపాయించుకునేందుకే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంత దూకుడు కూడా వికటిస్తే.. వీరికే ప్రమాదమని, మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని కూడా గ్రహిస్తే.. మంచిదనే సూచనలు వస్తున్నాయి. మరి వీరు మారతారో లేదో చూడాలి.