చాప కింద నీరులా క్షయ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చాప కింద నీరులా క్షయ

ఏలూరు, అక్టోబరు 15, (way2newstv.com)
పశ్చిమగోదావరి జిల్లాలో క్షయ వ్యాధి  చాపకింద నీరులా విస్తరిస్తోంది.  ఆ వ్యాధి మరణాలకు దారి తీస్తోంది.  మూడేళ్లుగా ఏటా 4,500 నుంచి ఐదు వేల కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేటు వైద్యులు చెబుతున్న ప్రకారం ఈ కేసుల సంఖ్య ఏటా మరో మూడింతలు అంటే 20 వేలకు పైమాటేనని తెలుస్తోంది. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి వేళ స్వల్ప స్థాయిలో జ్వరం రావడం, బాగా చెమటలు పట్టడం, నెలల తరబడి దగ్గు ఉండటం వంటి లక్షణాలతో క్షయ బాధితులు కొన్ని సందర్భాల్లో మరణాలపాలవుతున్నారు.ఏజెన్సీ, మెట్ట, డెల్టా అనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ క్షయ పీడితులు పెరిగిపోతున్నారు. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో క్షయ కేసులు అధికంగా నమోదవుతుండగా, ఏజెన్సీలో తక్కువగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో మరణాల సంఖ్య మాత్రం అధికంగా ఉంటోంది.
చాప కింద నీరులా క్షయ

రోగ నిరోధక శక్తి బలహీనపడినప్పుడు క్షయ వ్యాధి దాడి చేస్తుంది. పొగ తాగేవారు, మద్యం అలవాటు ఉన్న వారు, మధుమేహం, హెచ్‌ఐవీ బాధితులు, గని కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మురికి వాడల్లో నివసించే వారు, గాలి సరిగా ప్రసరించని ప్రాంతాల్లో జీవించే వారికి క్షయ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. సరైన పోషకాహారం , నిద్ర వంటివి లోపించడం వలన రోగ నిరోధక శక్తి సన్నగిల్లే వారికి ఈ ముప్పు పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా క్షయ వ్యాధి ఊపిరితిత్తులకు సోకుతుంటుంది. ఇక్కడితోనే కాకుండా శరీరంలో గోళ్లు, వెంట్రుకలు మినహా ఏ భాగాన్నయినా క్షయ కబళిస్తుంది.జిల్లాలో ఏటా 4,500 నుంచి 5 వేల వరకు క్షయ వ్యాధి కేసులు నమోదవుతున్నాయని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారిణి డా.జి రత్నకుమారి  తెలిపారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. క్షయ పీడిత జిల్లాల్లో మన రాష్ట్రం 4వ స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు. మురికివాడల్లోని పరిస్థితులే క్షయ వ్యాధికి ప్రధాన కారణం. ఇరుకు ఇళ్లల్లో, ఒకే గదిలో ఎక్కువ మది నివసించడం వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.  ముఖ్యంగా భవన నిర్మాణ పనులు, శ్లాబ్‌లు, సిమెంట్‌ పనులు చేసే వారికి మార్కెట్లలో పని చేసే కార్మికులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తోంది. వ్యాధి నివారణకు జిల్లాలోని అన్ని ఏరియా ప్రభుత్వాసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు ఉన్నాయి.జిల్లాలో క్షయ కేసుల సంఖ్య పెరగడానికి స్థానిక పరిస్థితులే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణంలో దుమ్మ ధూళి కణాలు పెరిగిపోవడం వలన క్షయ విస్తరిస్తోంది. క్షయ వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వారి నుంచి వచ్చే బ్యాక్టీరియా గాల్లోని దుమ్ము ధూళి కణాలకు అతుక్కుపోయి, ఇతరులు ఆ గాలి పీల్చినపుడు వారి శరీరంలోకి చేరి వ్యాధిబారిన పడుతున్నారు. గతంలో మురికి వాడలు, ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి, ప్రస్తుతం దుమ్మ ధూళి కణాల ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది.వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి 10 మందిలో నలుగురిలో క్షయ క్రిమి ఉంటుంది. ఒంట్లో క్రిమి ఉన్నంత మాత్రాన వాళ్లంతా  క్షయ బాధితులేం కాదు. శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి  దానిని సమర్థవంతంగా నియంత్రణలో ఉంచుతుంది. దీనిని ‘లేటెంట్‌ టీబీ’ అంటారు. శరీరంలో ఈ క్రిమి ఉన్న 10 శాతం మందిలో మాత్రం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వ్యాధి నిరోధక శక్తి లోపించినప్పుడు  ఈ క్రిమి విజృంభించి క్షయ వ్యాధికి కారణమవుతుంది. ఇలాంటి వారిని తక్షణమే గుర్తించి సమర్థంగా చికిత్స చేస్తే ఈ క్రిమి వ్యాప్తి, విజృంభణ, ఉద్ధృతి తగ్గుతాయి. కానీ.. ఈ విషయంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతోంది. వ్యాధి బారిన పడిన వారు ప్రభుత్వాసుపత్రులకు వెళితే తప్ప ఈ కేసులు నమోదవటం లేదు. ప్రైవేటు వైద్యులు క్షయ అనుమానిత కేసులను నేరుగా ప్రభుత్వాసుపత్రికి పంపిస్తే తప్ప ఈ కేసులు ఉన్నట్టు గుర్తించలేని పరిస్థితి. గ్రామాలు, వార్డుల స్థాయిలో సర్వే నిర్వహించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది.