చెంతనే నీరు.. కానీ గొంతు తడవదు (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చెంతనే నీరు.. కానీ గొంతు తడవదు (కృష్ణాజిల్లా)

కైకలూరు, అక్టోబర్ 23  (way2newstv.com): 
ఆసియాలోనే పెద్దదైన మంచి నీటి సరస్సు కొల్లేరు సమీపంలోనే తాగునీటి సమస్య విలయతాండం చేస్తోంది. కొల్లేరు సరస్సును ఆనుకొని 122 లంక గ్రామాలున్నాయి. వీటిలో సుమారు మూడు లక్షలకు పైగా ప్రజలు జీవిస్తున్నారు. వీరిలో సింహభాగం స్వచ్ఛమైన తాగునీరు లేక నిత్యం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కొల్లేరు నిండుగా నీరున్నా.. తాగేందుకు మాత్రం పనికి రావడం లేదు. అత్యధికంగా ప్రజలు తాగునీటి కోసం క్యాన్లపై ఆధారపడుతున్నారు. మరికొందరు తాగునీటిని 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలనుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. మిగిలినవారు కలుషితమైన నీటినే ఇప్పటికీ తాగుతున్నారు. 
చెంతనే నీరు.. కానీ గొంతు తడవదు (కృష్ణాజిల్లా)

సరస్సు పరివాహకంలోని చేపల చెరువుల్లో ఇష్టారాజ్యంగా రసాయనాలను వాడుతుంటారు. ఆ నీటిని ఏమాత్రం శుద్ధి .చేయకుండానే సరస్సులోనికి విడుదల చేస్తున్నారు. ఉప్పునీటి రొయ్యల సాగుకు వాడుతున్న బోరు నీటిని కూడా కాలువల్లోకి వదిలేస్తున్నారు. ఫలితంగా మంచినీటి కాలువలు, చెరువులు సైతం పూర్తిగా కలుషితమైపోతున్నాయి. దీని ప్రభావం కొల్లేరుపై కూడా పడి.. సరస్సులోనూ ఉప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమై పోతున్నాయి. ఈ నీటిలో హానికరమైన క్రిమిసంహారక అవశేషాలు, పలిసైక్లిక్‌ ఆరోమేటిక్‌ హైడ్రో కార్బన్లు, భారీ లోహ అశేషాలు పేరుకుపోతున్నాయి. దీంతో కొల్లేరులోని నీరు తాగేందుకు కాదు కదా.. అందులో జీవించే చేపలు ఆహారంగా తీసుకోవడానికి కూడా పనికి రావని నిపుణులు చెబుతున్నారు.కైకలూరు మండలం పెంచికలమర్రు, మండవల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామాల్లో రూ.1.50 కోట్లు వెచ్చించి రెండు పథకాలను ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మండవల్లిలో 14 గ్రామాలకు అందించాల్సిన శుద్ధనీరు పథకం పైపులు మరమ్మతుల కారణంగా కేవలం నాలుగు గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన 10 లంక గ్రామాల్లో ప్రజలు మంచినీటికి విలవిల్లాడాల్సి వస్తోంది. కాని దాని నిర్వహణకు రూ.లక్షల్లో బిల్లులను గుత్తేదారులు వాడుకుంటున్నారు. ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకుని తాగాల్సి వస్తోంది.