జనరిక్ మందులకు పెరుగుతున్న డిమాండ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనరిక్ మందులకు పెరుగుతున్న డిమాండ్

గుంటూరు, అక్టోబరు 23, (way2newstv.com)
రోగులకు వైద్యానికి అయ్యే ఖర్చులో సగం మందుల కొనుగోలుకే అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో 21 జనరిక్‌ మందుల షాపులు ఏర్పాటు చేయించింది. అయితే జనరిక్‌ మందులను  రోగులు వినియోగించేలా  వైద్యులు, సంబంధిత అధికారులు అవగాహన కల్పించకపోవటంతో ప్రస్తుతం కేవలం ఆరు షాపుల్లో మాత్రమే జనరిక్‌ మందుల విక్రయాలు జరుగుతున్నాయి.  గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి, పెదనందిపాడు, బాపట్ల, రేపల్లెలో మాత్రమే ప్రభుత్వ జనరిక్‌ షాపుల్లో విక్రయాలు జరుగుతున్నాయి.  ప్రైవేటు సంస్థల వారు సైతం జనరిక్‌ మందుల షాపులు ఏర్పాటుచేసినా ప్రజలకు జనరిక్‌ మందులపై అవగాహన లేమి, అపోహలు ఉండటం వల్ల మందుల విక్రయాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. 
జనరిక్ మందులకు పెరుగుతున్న డిమాండ్

జనరిక్‌ మందులు వాడటం వల్ల ఖర్చు చాలావరకు ఆదా అవుతుంది. కంపెనీ మందుల రేట్లతో పోల్చితే సగానికన్నా తక్కువ రేట్లకే నెలమొత్తానికి సరిపడా మందులు వస్తాయి.భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం ప్రతి వైద్యుడు రోగులకు  మందుల ఆర్థిక భారం తగ్గించాలని, అందుకోసం జనరిక్‌ మందలు రాయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పలువురు  వైద్యులు మందుల కంపెనీల నిర్వాహకులు ఇచ్చే బహుమతులు, ప్రలోభాల మాయలో పడి బ్రాండెడ్‌ మందులనే రాస్తున్నారు. పలు ఫార్మా కంపెనీల నిర్వాహకులు తమ మందుల కొనుగోళ్లు పెంచుకునేందుకు వైద్యులకు కుటుంబ సభ్యులతో సహా విదేశీ యాత్రలను సైతం ఉచితంగా కల్పిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఏసీలు, ఫ్రిజ్‌లు,  కార్లు, ఇతర ఖరీదైన వస్తువులను సైతం వైద్యులకు కొనిచ్చి తమ కంపెనీ మందులనే రాయాలని మచ్చిక చేసుకుంటున్నారు.ప్రతి నెలా ఒక్కో రకమైన ఆఫర్లు ఇస్తూ వైద్యులను తమ బుట్టలో వేసుకుంటూ తమ కంపెనీ ఉత్పత్తులను పెంచుకుంటూ రోగులకు మందుల ఖర్చులు తడిసి మోపెడయ్యేలా చేయటంలో ఫార్మా కంపెనీల ప్రతినిధులు పోటీ పడుతున్నారు.  గుంటూరు జీజీహెచ్‌తోపాటుగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, ప్రైవేటు వైద్యులు కూడా జనరిక్‌ మందులు రాయకుండా తమకు కమీషన్లు ఇచ్చే కంపెనీల మందులనే రోగులకు రాస్తున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్, ఏపీ మెడికల్‌ కౌన్సిల్, మెడికల్‌ ఎతిక్స్, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు, ప్రతినిధులు చొరవ చూపి జనరిక్‌ మందులను వైద్యులు రాసేలా చర్యలు తీసుకుంటే పేద రోగులకు ఎంతో ప్రయోజనం చేకూర్చినవారు అవుతారు.మందులు తక్కువ ధరలకే ఎందుకు ఇస్తారనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మందుల్లో సరైన రసాయనాలు కలపకపోవటం వల్లే వాటిని తక్కువ ధరలకు ఇస్తున్నారనే తప్పుడు ప్రచారం, అపోహల వల్ల కూడా చాలామంది జనరిక్‌ మందులను వినియోగించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఏదైనా జబ్బుకు మందును తయారు చేసిన పిదప వాటిì  అమ్మకాల కోసం మెడికల్‌ రిప్‌లు, డీలర్లు ఇలా పలువురు మధ్యవర్తులను కంపెనీ యజమానులు నియమించుకుని వారికి మందులు అమ్మినందుకు కమీషన్‌ ఇస్తుంటారు. వాటితోపాటుగా మందుల వినియోగం కోసం విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియాలలో వాణిజ్య ప్రకటనలు  ఇస్తుంటారు. వీటన్నిటికోసం అయ్యే ఖర్చును తయారు చేసిన మందులపైనే వేసి వినియోగదారులకు అమ్ముతూ ఉండటంతో రోగులకు అధికరేట్లకు మందులను అమ్మాల్సి వస్తుంది. జనరిక్‌ మందుల విషయంలో ఇలాంటి మధ్యవర్తులు ఉండరు. ఎలాంటి ప్రచార ఖర్చులు ఉండవు. ఫలితంగా ఎంఆర్‌పీ కంటే సగానికి తక్కువ రేట్లకే జనరిక్‌ మందులు రోగులకు లభిస్తున్నాయి. మందులను తయారు చేసిన పిదప ఫలానా కంపెనీ వారు వాటిని తయారు చేశారని బ్రాండ్‌నేమ్‌ ముద్రించి అమ్మటం వల్ల మందులు అధిక ధరలకు మార్కెట్‌లో విక్రయిస్తారు. జనరిక్‌ మందుల వారు కంపెనీపేర్లు ముద్రించకుండా(బ్రాండ్‌నేమ్‌) లేకుండా అమ్మకాలు చేస్తూ ఉండటంతో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఉదాహరణకు జ్వరం తగ్గించేందుకు మనం వాడే మాత్రను ‘పారాసిట్‌మాల్‌’ అనే మందుతో తయారు చేస్తారు. మందుల కంపెనీవాళ్లు పారాసిట్‌మాల్‌ మాత్రకు  క్రోసిన్, మెటాసిన్, ఫెపానిల్, డోలో–650, మెరిమాల్, కాల్‌పాల్, పెసిమాల్‌ తదితర పేర్లు తగిలించి అమ్ముతారు. కంపెనీ పేర్లు వల్ల(బ్రాండ్‌మార్క్‌) రేట్లు అధికంగా ఉండటమే తప్ప జనరిక్‌ మందులకు, ఇతర మందులకు ఎలాంటి తేడా ఉండదని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.