బలపడేదిశగా జనసేనాని అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బలపడేదిశగా జనసేనాని అడుగులు

విశాఖపట్టణం, అక్టోబరు 23 (way2newstv.com)
జనసేనాని పవన్ కల్యాణ్ ఒక బలమైన అంశంతో ప్రజల్లో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. సరైన సమయంలో రంగంలోకి దిగకపోతే ఎంతపెద్దనాయకుడైనా అట్టర్ ఫ్లాపవుతాడు. సమయం అనుకూలించే సందర్భాల్లో ఓ మోస్తరు నాయకుడు సైతం సూపర్ హిట్ కొడతాడు. అందుకే తగిన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు పాలిటీషియన్స్. టాపిక్ దొరికినప్పుడు టైమ్ చూసి కొడితే రాత్రికి రాత్రే నాయకులయిపోయిన వారూ ఉన్నారు. తెలంగాణలో నిన్నామొన్నటివరకూ కేసీఆర్ కు ఎదురు చెప్పగల నాయకుడనేవారే లేరు. ఆర్టీసీ సమ్మె పుణ్యమా అని అందరూ ఒకటవుతున్నారు. చిన్నాచితక నాయకులు సైతం ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తేంత ధైర్యాన్ని పుంజుకున్నారు. 
బలపడేదిశగా జనసేనాని అడుగులు

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ గ్లామర్ హీరో . లక్షలాదిమందికి ఆరాధ్య దైవం. రాజకీయాలు ఆయనకు పెద్దగా అచ్చిరాలేదు. ప్రజాదరణ, ప్రాచుర్యం ఉన్నప్పటికీ కాలం కలిసి రావడం లేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ తానే విజయం సాధించలేకపోయారు. దానికి ప్రధాన కారణం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మూడోపక్షానికి చోటిచ్చే స్థితిలో లేకపోవడమే. అయితే ఇప్పుడు క్రమక్రమంగా రాజకీయావకాశాలను అందిపుచ్చుకునే దిశలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.జనసమ్మోహన శక్తిగా ఉంటే సరిపోదు. ఆ అభిమానాన్ని ఓట్లుగా మలచుకోగలిగినప్పుడే ప్రజాస్వామ్యంలో అధికారం సాధ్యమవుతుంది. పీఠం అధిష్టిస్తేనే తన సిద్ధాంతాలు,ఆశయాలు అమలు చేసేందుకు వీలు చిక్కుతుంది. జనసేనకు ఇక్కడే చిక్కొచ్చి పడింది. సిద్దాంతాలు, విధివిధానాలపై పెట్టిన శ్రద్ద అధికారానికి చేరువ చేసే వ్యూహం అమలుపై పెట్టలేకపోయారు. ఫలితంగా యుద్ధానికి ముందే చేతులెత్తేసినట్లయ్యింది. అధికారం తమకు అంతిమలక్ష్యం కాదన్నట్లుగా చేసిన ప్రచారం పూర్తి స్థాయి వైఫల్యానికి దారి తీసింది. తమనే ఎందుకు ఎన్నుకోవాలనే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో జనసేన సక్సెస్ కాలేకపోయింది. రెండు వైపులా మోహరించిన వైసీపీ,టీడీపీ లకు తమ పార్టీ ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అయిదు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. లోపాలున్నప్పటికీ వాటిపై రాజకీయంగా పోరాటం సాగించే పరిస్థితి లేదు. అందుకే ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశాన్ని గుర్తించి ఎడతెగని పోరాటం సాగిస్తే ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్లడం సులభమవుతుంది. ఆ సమస్య పట్ల ఉండే సానుభూతి ఆ రాజకీయ పక్షానికి సాధికారత తెచ్చిపెడుతుంది.వైసీపీ సర్కారును బాగా ఇబ్బంది పెట్టిన అంశం ఇసుక కొరతే. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, పోలవరం నిర్మాణ పనుల రీ టెండరింగ్ వంటి పెద్ద విషయాలు కూడా ప్రజల్లో పెద్దగా అసంతృప్తికి , ఆందోళనకు దారితీయలేదు. కేంద్రమూ, రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఆందోళన వ్యక్తం చేసినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొణకలేదు. బెణకలేదు. కానీ ఇసుక కొరత విషయం వచ్చేటప్పటికి సర్కారు డిఫెన్స్ లో పడిపోతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సరఫరాను నిలిపివేయడం, కొత్త విధానం పేరిట తాత్సారం చేయడం, దాని అమలులో వైఫల్యాలు వెరసి ఇసుక అనేది రాజకీయ ముడిసరుకుగా మారిపోయింది. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. దాదాపు 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. నిజంగా రాజకీయపార్టీలు ఫోకస్ చేయగలిగితే అంతకుమించిన ప్రచారాస్త్రం మరొకటి దొరకదు. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా దీనిపైన ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికీ టీడీపీ దీనిపై ఆరోపణలు గుప్పిస్తోంది. గతంలో పార్టీ నాయకులు, కార్యకర్తల ఇసుక అక్రమాలను చూసీ చూడనట్లు టీడీపీ సర్కారు వదిలేసిందనే విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం ఆ పార్టీ బలంగా తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతోంది. జాతీయ పార్టీ బీజేపీ సైతం ఇసుకను ఆసరా చేసుకుంటూ భిక్షాటన, ఆందోళనలు చేసింది. క్షేత్రస్థాయిలో బలం తక్కువగా ఉండటంతో కమలం పార్టీ ఉద్యమమూ పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. ఇప్పుడు వచ్చే నెల నుంచి పవన్ కల్యాణ్ ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డ వైనంపై ఉద్యమానికి సై అంటున్నారు. పవన్ కల్యాణ్ కు ఉండే అభిమానులు, సమస్య తీవ్రత కలగలసి ఒకే తాటిపైకి వస్తే ఎంతో కొంత స్పందన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని స్పందింప చేయగలిగితే సక్సెస్ సాధించినట్లే.ఇసుక కొరత అనేది కేవలం భవన నిర్మాణ కార్మికులకే పరిమితం కాదు. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. దాని ప్రభావం ఇతర రంగాలపైనా పడింది. సిమెంటు, కాంక్రీట్, గ్రానైట్ వంటి పరిశ్రమలూ సంక్షోభంలో పడ్డాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి లభించాల్సిన ఆదాయానికీ గండి పడింది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో ఆయా రంగాల ద్వారా ప్రభుత్వానికి 1155 కోట్ల రూపాయల వరకూ ఆదాయం లభించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది 843 కోట్లకే పరిమితమైంది. అంచనాల కంటే 312 కోట్ల ఆదాయం తగ్గింది. 27 శాతం ఆదాయం ప్రభుత్వానికి కుచించుకుపోయింది. అంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్లే లెక్క. ఇసుక అంశం రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలలోనూ చర్చనీయమవుతోంది. ఒక రాజకీయ పార్టీకి ఇంతకు మించిన అస్త్రం ఉండదు. అదే ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఒక ఆయుధంగా మారబోతోందనే వాదన వినవస్తోంది. అంచనాలకు మించి పరాజయాన్ని మూటగట్టుకున్న జనసేన పుంజుకోవడానికి విస్త్రుత ప్రాతిపదికను నిర్మించుకోవడానికి ఒక చాన్సుగా బలమైన చాయిస్ గా ఈ ఆందోళన తోడ్పడుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా. అయితే కంటిన్యుటీతో పాటు కనీసం ప్రభుత్వం స్పందించేవరకైనా ఉద్యమాన్ని కొనసాగిస్తేనే ఫలితం ఉంటుంది. రెండు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించి చాప చుట్టేస్తే మాత్రం ఉద్యమంతో పాటు పార్టీ కూడా చతికిలబడిపోతుంది.