కాస్మోటిక్ కోసం విద్యార్ధునుల ఎదురు చూపులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాస్మోటిక్ కోసం విద్యార్ధునుల ఎదురు చూపులు

విజయనగరం, అక్టోబరు 4, (way2newstv.com)
అధికారులు నిర్లక్ష్యం వల్ల కేజీబీవీ విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదరికంతో  డ్రాపౌట్లుగా మారిన విద్యార్థినుల కోసం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ జిల్లా అధికారుల నిర్వహణ లోపం వల్ల విద్యార్థినులే కాస్మొటిక్‌ చార్జీలు భరించాల్సి వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు వసతితోపాటు స్టేషనరీ, కాస్మొటిక్‌ చార్జీలు వంటివాటిని యంత్రాంగం అందించాల్సి ఉంది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగునెలలు కావస్తున్నా జిల్లా సర్వశిక్షాభియాన్‌ వాటిని అందివ్వలేదు. ఇందుకు సంబంధించిన నిధులు రెండు నెలల క్రితమే జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా... పర్చేజింగ్‌ టెండర్‌ చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
కాస్మోటిక్ కోసం విద్యార్ధునుల ఎదురు చూపులు

మొత్తం 33 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినికి రెండు జతల యూనిఫాం, పాదరక్షలు, స్టేషనరీ, వారికి అవసరమైన నోట్‌ పుస్తకాలు, ప్లేట్లు, పెట్టెలు, కాస్మొటిక్‌ వస్తువులు, పాఠ్యపుస్తకాలు వంటివి విద్యాలయాల్లోనే ఇవ్వాలి. తొలుత జిల్లా స్థాయిలోని పర్చేజింగ్‌ కమిటీల ద్వారానే కొనుగోలు చేసి జూన్‌ నెలలోనే వాటిని పంపిణీ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రస్థాయిలో టెండర్లు వేసి అన్ని జిల్లాలకు పంపి ణీ చేశారు. దానివల్ల ఆలస్యం అవుతోందని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా స్థాయిలోనే పర్చేజ్‌ చేసుకోమని రెండు నెలల క్రితమే నిధులు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఒక్కో విద్యార్థినికి కాస్మొటిక్‌ వస్తువుల కోసం నెలకు రూ.125, శానిటరీ నాప్‌కిన్స్‌ కోసం నెలకు రూ.35లు ఇవ్వాలని ఆదేశించారు.  కానీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నాలుగునెలలవుతున్నా టెండర్‌ ఊసే లేదు. కనీసం డబ్బులు చెల్లించలేదు. విద్యార్ధినులు తమకు అవసరమైన వస్తువులను సొంత డబ్బు వెచ్చించి బయటే కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.జిల్లాలో 33 కేజీబీవీల్లో 6,500 మంది విద్యార్థినులున్నారు. గడిచిన నాలుగు నెలల్లో వారు నెలకు కాస్మొటిక్‌ వస్తువులకోసం రూ.125, శానిటరీ నాప్కిన్స్‌కి రూ.35 వంతున రూ.41.6 లక్షల ఆర్థిక భారం మో యాల్సి వచ్చింది. కాస్మొటిక్‌ వస్తువులు పంపిణీ అయ్యేంతవరకు దుస్తులు శుభ్రపర్చుకోవడానికి నెలకు మూడు సబ్బులు, స్నానం సబ్బులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేస్టులు, తలకు కొబ్బరి నూనె, ముఖానికి రాసుకునేందుకు పౌడర్‌ డబ్బాలు, షాంపూలు, బ్రష్‌లు కొనుగోలు చేయాలి. అయితే నాలుగునెలలుగా వీటికి డబ్బులు రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.