తెలుగు రాష్ట్రాల సీఎంలు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలుగు రాష్ట్రాల సీఎంలు...

నో... పున: సమీక్ష... మేమింతే
హైద్రాబాద్, విజయవాడ, అక్టోబరు 18, (way2newstv.com)
తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు... అంటున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో అదే సాగుతోంది. ఒకవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. కేసీఆర్ పట్టుబట్టి కూర్చున్నారు. తగ్గేదే లేదంటున్నారు. ఇంకోవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతతో నిర్మాణ , రియల్ ఎస్టేట్ రంగాలు కుదేలు అయ్యాయి. అయినా పున:సమీక్షపై దృష్టి సారించడం లేదు. రాజధాని విషయంలోనూ తన వాదనకే కట్టుబడి ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ . ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాజీవనం, అభివృద్ధి కి సంబంధించి కొత్త సమస్యలు తలెత్తే వాతావరణం కానవస్తోంది. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలుపై ఆర్థిక మాంద్యం దెబ్బ ఉరుమురిమి చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తన బడ్జెట్ పరిమాణాన్ని కుదించుకుంది.
తెలుగు రాష్ట్రాల సీఎంలు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆశావహంగానే ఎదురుచూస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేవరకూ కష్టాల ఎదురీత తప్పకపోవచ్చనేది నిపుణుల అంచనా.తెలంగాణ రాష్ట్రసమితి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ ఎన్నికల్లో సాధించినవి అసాధారణ విజయాలు. ప్రతిపక్షాలన్నీ కకావికలమైపోయాయి. అన్నిపార్టీలు జట్టుకట్టి నిలిచినా టీఆర్ఎస్ మూడింట రెండువంతుల సీట్లు గెలుచుకుంది. ఇక ఏపీలో అయితే వైసీపీ ఏడింట ఆరువంతుల సీట్లు దక్కించుకుంది. తెలుగుదేశానికి, వైసీపీకి మధ్య పదిశాతం పైగా ఓట్ల తేడా నమోదైంది. ఎదురే ఉండని స్థితి. కానీ అటు ఆరునెలల వ్యవధిలోనే తెలంగాణలో తేడా వచ్చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనాలుగు నెలలకే కొంత ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. రాజకీయంగా ఆటుపోట్లను ఎదుర్కోవడంలో కేసీఆర్ దిట్ట. అయితే తాజాగా ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోరాటం చేసేందుకు యత్నిస్తున్నాయి. ప్రజామద్దతు ఉన్నంతవరకూ విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ పెద్దగా లెక్క చేయలేదు. ప్రజల్లోనూ దాని ప్రభావం పడలేదు. ప్రజాజీవితంతో ముడిపడిన విషయాల్లో సైతం తనదైన ధోరణిలోనే వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి భీష్మించుకోవడంతో ఫలితాలు కొంత ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె ఇందుకు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. ఆంధ్ర్రప్రదేశ్ లో ఇసుక, రాజధాని అంశాలను వైసీపీ ప్రభుత్వమే సొంతంగా సృష్టించుకుంది. అవే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, జనసేన వంటి పార్టీలన్నీ ఒకే అజెండాపై కూర్చోవడానికి ప్రాతిపదికలవుతున్నాయి. రాజకీయంగా ఆయా అంశాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావనలు ప్రేరేపితం కావడానికి ముడిసరుకుగా మారుతున్నాయి.రెండు రాష్ట్రప్రభుత్వాలు బడ్జెట్ లో ప్రతిపాదించిన గణాంకాలను రియలైజ్ చేయడం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్పత్తులు, వస్తు సేవల రూపంలో లభించే ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. కొనుగోళ్లు మందగించాయి. ఈ విషయంలో తెలంగాణది ఒక సమస్య. ఆంధ్రప్రదేశ్ ది మరొక రకం సమస్య. రియల్ ఎస్టేట్ , నిర్మాణ రంగాలకు సంబంధించిన ఆదాయం ఆంధ్ర్రప్రదేశ్ ను మూడేళ్లపాటు ఆదుకుంది. తాజాగా ఈ రంగం బాగా కుదేలైపోయింది. తెలంగాణలో సాఫ్ట్ వేర్, సర్వీసు సెక్టారు, ఆటోమొబైల్ రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుండేవి. ఇప్పుడు ఆయా రంగాల్లో మందగమనం ఆదాయమార్గాన్ని దెబ్బతీస్తోంది. ఆంధ్రాలో భూముల కొనుగోళ్లు విక్రయాల విషయంలో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో కనిపించిన ఉత్సాహపూరిత వాతావరణం కరవైంది. అయితే రాష్ట్రప్రభుత్వ యోచన మరో విధంగా ఉంది. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో విపరీతమైన ఆదాయ వృద్ధి రేటు గడచిన మూడేళ్లలో కనిపించింది. అదే వృద్ధి రాయలసీమ, ఉత్తరాంధ్రలో సైతం కనిపించేలా చేయగలిగితే పన్నుల ఆదాయం గతం కంటే బాగా పెరుగుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ సాంకేతికంగా ఇంతవరకూ డీసెంట్రలైజేషన్ కు సంబంధించి విధి విధానాలు, నిర్ణయాలు ఖరారు కాకపోవడంతో ప్రభుత్వ యోచనలు ఇంకా పట్టాలకెక్కలేదు.సంక్షేమ పథకాల అమలు విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీలు పడుతున్నాయనే చెప్పాలి. గడచిన అయిదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తానిచ్చిన ప్రతి హామీని అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆర్థిక భారం, పర్యవసానాల గురించి ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. తొలి ఆరునెలల్లో వాగ్దానాల అమలుకు సంబంధించి మొత్తం ప్రణాళికను పట్టాలపైకి ఎక్కించేయాలన్నది సీఎం జగన్ యోచన. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలన ఇతర అంశాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలని ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అందుకే వరసగా వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించుకుంటూ వెళుతున్నారు. నిజానికి రైతు భరోసాను వచ్చే ఏడాది ఖరీఫ్ లో ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇప్పటికే కేంద్రం ఆరువేల రూపాయల వరకూ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి పేరిట ఇస్తోంది. ఖరీప్ వరకూ ఆగితే పథకం ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకే పీఎం కిసాన్ ను వైఎస్సార్ రైతు భరోసా తో కలిపి అమల్లోకి తెచ్చేసింది రాష్ట్రప్రభుత్వం. పిల్లల్ని చదివించే తల్లులకు పదిహేనువేల రూపాయలు అందచేసే అమ్మ ఒడి పథకం అమలుకు జనవరి ని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటన్నిటిని అమల్లోకి తెచ్చిన తర్వాతనే రీజనల్ డెవలెప్ మెంట్ ప్లాన్లు అమలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏపీ అమలు చేస్తున్న కొన్ని పథకాలు పక్కనున్న తెలంగాణకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం, అమ్మ ఒడి పథకాలు కేసీఆర్ సర్కారుపైనా ఒత్తిడి పెంచుతున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా జనబాహుళ్యంలో సర్కారు స్థిరత్వాన్ని సాధించగలుగుతుందనేది ముఖ్యమంత్రి జగన్ విశ్వాసం. అయితే వీటి అమలులో ఆర్థికపరంగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పాత చెల్లింపులు, పనులు నిలుపుదల చేసైనా సంక్షేమపథకాలకు నిధులు సర్దుబాటు చేసేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.