విజయవాడ, అక్టోబరు 24 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. నవరత్నాలకు తోడు సరికొత్త పథకాలతో సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ మధ్యే నేతన్నలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. వారిని ఆదుకునేంతుకు వైఎస్సార్ నేతన్న నేస్తం పేరుతో సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కేబినెట్‌లో కూడా గ్రీన్ సిగ్నల్ లభించడంతో.. పథకానికి తుది మెరుగులు దిద్ది.. అమలు దిశగా అడుగులు వేస్తోంది.
ఏపీలో మరో కొత్త పథకం
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి బుధవారం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ పథకం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు.ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పాదయాత్రతో పాటూ నవరత్నాల్లో భాగంగా నేతన్నలకు చేయూత ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చారు. మరో రెండు నెలల్లోనే ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది