న్యూడిల్లీ, అక్టోబరు 24 (way2newstv.com)
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. మహారాష్ట్రలో బీజేపీ కూటమి, హర్యానాలో బీజేపీ గెలుపు ఖాయమని అన్ని ఫలితాలు ఖాయం చేశాయి. దీంతో మోదీ హవా తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహరాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి దాదాపుగా డబుల్ సెంచరీ సాధిస్తుందని.. అలాగే 90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 71సీట్లు దక్కించుకుంటుందని అన్ని పోల్స్ అంచనా వేశాయి. అలాగే కాంగ్రెస్- ఎన్సీపీ కూటమికి 70-81 స్థానాలు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి జెండా ఎగురడానికి గల కారణాలు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిజమైన ఎగ్జిట్ పోల్స్
అవేంటంటే..!గత 20సంవత్సరాలుగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. రాష్ట్రంలోనూ అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. అయితే ఒక్క 1999లో మాత్రమే కేంద్రంలో బీజేపీ గెలవగా.. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎస్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ లెక్కన ఇప్పుడు కూడా బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తాజా పరిణామాలను చూసుకుంటే.. ఇటీవల మహారాష్ట్రలో అరే వివాదం సంచలనంగా మారింది. మెట్రో నిర్మాణం కోసం చెట్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వగా.. దీనిపై చాలా మంది ప్రజలు తమ గొంతును వినిపించారు. కానీ బీజేపీ గెలుపుపై ఇది పెద్దగా ప్రభావం చూపలేదన్నది విశ్లేషకుల మాట. అలాగే పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం ఉండగా.. బాలీవుడ్ సెలబ్రిటీలందరితో మోదీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంటే స్టార్లందరూ మోదీకి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లైంది. ఈ మీటింగ్ కూడా కూటమి గెలుపుకు ఎంతో కొంత ప్రభావం చూపిందన్నది వారి అభిప్రాయం. ఇక ముందుతో పోలీస్తే మహారాష్ట్రలోని అన్ని వర్గాల్లో బీజేపీకి ఓటర్ల శాతం పెరుగుతూ వస్తున్నారు. ఈ విషయం 2017లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ స్పష్టమైంది. ఆ ఎన్నికల్లో స్థానిక పార్టీల కంటే బీజేపీనే ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం విశేషం. అలాగే అన్ని రాష్ట్రాల మాదిరిగానే మహారాష్ట్రలోనూ ప్రజలకు సమస్యలు ఉన్నప్పటికీ.. అవేవి బీజేపీకి వ్యతిరేకంగా మారలేకపోయాయి.ఇక ప్రధాన ప్రతిపక్షంగా బరిలోకి దిగిన కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి ప్రచారంలోనూ ఎన్డీయేకు పోటీ ఇవ్వలేకపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మరోసారి తన అపరిపక్వతను బయటపెట్టారు. ఏదో ప్రచారం చేయాలి కదా అన్న చందనా ఆయన ఎలక్షన్ క్యాంపైయిన్ జరిగింది. అలాగే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో హడావిడి చేసిన ప్రియాంక గాంధీ సైతం మహారాష్ట్ర ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. ఇలా ప్రతిపక్షాల బలహీన ప్రచారం కూడా బీజేపీ కూటమికి కలిసొచ్చింది. మొత్తానికి ఇవన్నీ మహారాష్ట్రలో బీజేపీ గెలుపుకు ముఖ్య కారణంగా మారాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వమే ఉండగా.. ఆ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో అంత నెగిటివ్ లేదు. ఈ క్రమంలో అక్కడ కూడా బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.