కరీంనగర్, అక్టోబరు 16, (way2newstv.com)
దసరా పండుగ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటున్న ప్రయాణికుల జేబుకు బస్ చార్జీల రూపంలో చిల్లులు పడుతున్నాయి. ఒక వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సుల్లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులను తిప్పే ప్రైవేట్ సిబ్బంది ఇష్టారీతిన దోచుకుంటున్నారు. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలు వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం ఉంటడం లేదు. చార్జీల దోపిడీ ఎప్పుడు ఆగుతుందోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తామని..గతంలో ఉన్న బస్సు ఛార్జీ కంటే ఎక్కువ వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రైవేట్ బస్సుల చేతి వాటం
అన్ని రూట్లలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ డిటీసీ శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సులకు కండక్టర్లను, డిపో మేనేజర్ కేటాయిస్తామని వెల్లడించారు. కండక్టర్లకు టిమ్ మిషన్లు అందజేస్తామన్నారు. అన్ని బస్సుల్లో రాయితీ బస్‌పాస్‌లకు అనుమతి ఇచ్చామన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే 100కు లేదా..ఆర్టీవో హెల్ఫ్ లైన్ 9391578144 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు.మెదక్‌లో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. అధికారులు చెప్పిన రూట్లలో కాకుండా..వారికి నచ్చిన మార్గాల్లో నడిపిస్తూ ప్రయాణికుల వద్ద అధిక డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. బస్సుల యాజమానులను కలెక్టర్ పిలిచి మందలించారు. ఆర్టీసీ అధికారులు చూపిన రూట్లలో మాత్రమే నడపాలని ఆదేశించారు