క్యాబ్ లకు కలిసొస్తున్న ఆర్టీసీ సమ్మె - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్యాబ్ లకు కలిసొస్తున్న ఆర్టీసీ సమ్మె

హైద్రాబాద్, అక్టోబరు 16, (way2newstv.com
ఆర్టీసీ కార్మికుల సమ్మె సిటీలోని క్యాబ్ సంస్థల పంట పండిస్తోంది. ఇదే అదునుగా అడ్డగోలు దోపిడీకి తెరతీశాయి. భారీగా చార్జీలు పెంచేసి అందినకాడికి దోచుకుంటున్నాయి. తెలివిగా సర్ చార్జీలు, పీక్ చార్జీల పేరిట వడ్డిస్తున్నాయి. సమ్మె నేపథ్యంలో అధిక చార్జీలు వసూలు చేయొద్దని అధికారులు స్పష్టంగా తేల్చిచెప్పారు. ప్రయాణికులపై భారం వేయొద్దని ప్రకటనలు చేశారు. కానీ ఫీల్డ్ లో పరిస్థితి వేరేలా ఉంది. స్ట్రైక్స్టార్ట్కాకముందు ఉన్న చార్జీలకు ఇప్పుడు వసూలు చేస్తున్న చార్జీలకు పొంతన లేకుండా పోయింది. ప్రతి రైడ్ పై దాదాపు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో కిలో మీటర్ కు దాదాపుగా రూ.40లకు పైగా వసూలు చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి.అధిక చార్జీల విషయంలో క్యాబ్ సంస్థలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. సర్ చార్జీలను ఇందుకు వినియోగించుకుంటున్నాయి. 
క్యాబ్ లకు కలిసొస్తున్న ఆర్టీసీ సమ్మె

మామూలు రోజుల్లో ఏదైనా ఏరియాలో వెహికిల్స్ షార్టేజ్ ఉన్న టైంలో సర్ చార్జీలు వసూలు చేస్తారు. అంటే వాహనాల సంఖ్య తక్కువగా ఉంది కనుక చార్జీలు ఎక్కువగా తీసుంటున్నట్లు ముందే యాప్ లో చూపిస్తాయి. ఈ ధరలు సాధారణ చార్జీల కన్నా రెట్టింపుగా ఉంటాయి. అయితే సిటీలో ప్రస్తుతం 70% రైడ్ లకు సర్ చార్జీలను వసూలు చేసేస్తున్నారు. సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, దిల్ సుఖ్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, చార్మినార్, కర్మాన్ ఘాట్ వంటి ప్రాంతాల్లో వెహికల్స్తక్కువగా ఉన్నట్లు సర్ చార్జీలు వసూలు చేసిన ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. అలాగే అన్ని ప్రధాన ప్రాంతాల్లో వెహికిల్స్ షార్టేజ్ పేరుతో సర్ చార్జీల వాత పెడుతున్నట్లు తెలిసింది. పీక్ చార్జీల వసూళ్లు మరీ అన్యాయంగా ఉంది. డిమాండ్ ను బట్టి రేట్లు పెంచుకునే అధికారం క్యాబ్ సంస్థలకు ఎవరిచ్చారని ఇప్పటికీ అధికారులు స్పష్టంగా తేల్చలేకపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పీక్ అవర్స్ పేరిట దోచుకుంటున్నారు. దీనిపై గతంలోనే ప్రయాణికుల నుంచి చాలాసార్లు వ్యతిరేకత వచ్చింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. తాజాగా సమ్మెను ఆసరాగా చేసుకొని పీక్ అవర్స్ లో రేట్లను మరింత పెంచేశారు.కొన్ని క్యాబ్ సంస్థలు డ్రైవర్లకు కమిషన్ ఎగ్గొట్టేందుకు కొత్త రకం వ్యుహాలు అనుసరిస్తున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. యాప్ ద్వారా చెల్లిస్తారా? డ్రైవర్ కు చెల్లిస్తారా అని ముందుగానే రైడ్ బుక్ చేసేప్పుడు ప్రశ్నిస్తున్నారు. యాప్ ద్వారా పే చేస్తే మాత్రం రేటు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.  కమిషన్ ఎగ్గొట్టేందుకు తమకు చూపించే రేటు వేరుగా ఉంటుందని కానీ కస్టమర్ దగ్గర ఎక్కువ రేటు వసూలు చేస్తున్నారంటున్నారు. డ్రైవర్ కి పే చేస్తున్నప్పుడు మాత్రమే ధరలు తక్కువగా ఉంటున్నాయని అందులోనూ 25 నుంచి 35 శాతం కమిషన్ ను క్యాబ్ సంస్థలే తీసుకుంటున్నాయంటున్నారు. సమ్మె ప్రారంభమైన నాటి నుంచి కస్టమర్ల దగ్గర వసూల్ చేస్తున్న చార్జీలు గతంలో కన్నా డబుల్ ఉంటున్నాయని కార్ డ్రైవర్లే చెబుతున్నారు.అడ్డగోలు చార్జీలను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఒకటి, రెండు వాహనాల్లో తనిఖీలు చేసి ఎక్స్ ట్రా చార్జీలు ఏమీ వసూలు చేయటం లేదని ఆర్టీఏ అధికారులు తేల్చేశారు. ఈ విషయం తెలిసిన వందలాది మంది ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టంగా యాప్ ల ద్వారా రేట్లు చూపిస్తూ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తుంటే ఆర్టీఏ అధికారులు మాత్రం అదేమీ లేదని చెబుతుండటం గమనార్హం. చార్జీల విషయంలో ఒకసారి యాప్ చెక్ చేస్తే ఏ సమయంలో ఎంత వసూలు చేస్తున్నారన్నది స్పష్టంగా తేలిపోతుంది. కావాల్సినన్ని బస్సులు లేక ఆటోలు, క్యాబ్ లు ఎంతగా దోపిడీకి పాల్పడినా ఆర్టీఏ అధికారులు చోద్యం చూస్తున్నారు