సత్యం ఆపరేషన్ పై ఉత్కంఠ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సత్యం ఆపరేషన్ పై ఉత్కంఠ

కాకినాడ, అక్టోబరు 2, (way2newstv.com)
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో రాయల్ వశిష్ఠ బోటు మునిగి రెండు వారాలు దాటుతుంది. నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తరువాత అన్ని వైపుల నుంచి వస్తున్న వత్తిడితో అత్యంత ప్రమాదకర ప్రాంతం నుంచి బోటు ను బయటకు తీసేందుకు అధికార యంత్రాంగం ముందుకు వచ్చింది. కాకినాడకు చెందిన బాలాజీ మైరెన్స్ కి బోటు వెలికితీసే పని 22 లక్షల రూపాయలకు వర్క్ ఆర్డర్ రూపంలో ఇచ్చారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. ఈ కీలకమైన ఆపరేషన్ లో పాల్గొనేవారందరికి బీమా కూడా చేశారు. దాంతో పాతికమంది తన బృందంతో సంఘటన స్థలికి చేరుకుంది బృందం. 
సత్యం ఆపరేషన్ పై ఉత్కంఠ

బోటును తీసేందుకు సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పని ప్రారంభించింది ధర్మాడి టీం.తొలి రోజు చేసిన ప్రయత్నాలు కొంత మేర ఫలించినట్లే అనిపించినా సత్యం బృందానికి నిరాశే మిగిలింది. బోటు మునిగిన ప్రాంతంగా విశాఖ నేవీ గుర్తించిన చోట్ల ఐదు లంగర్లు దించిన టీం కి రెండు లంగర్లకు బలంగా ఏదో తగలడంతో దానిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. భారీ ప్రొక్లైనర్, క్రేన్ లతో బాటు ఐరన్ వైర్, భారీ తాడులతో పాటు ఒక పంటు తో బాటు ఎన్ డి ఆర్ ఎఫ్, పోలీస్ బృందాలు సత్యం టీం కి సహకారం అందిస్తున్నారు.గల్లంతైన వారిలో మరో 15 మంది మృతదేహాలు ఈ ప్రమాదంలో దొరకాల్సి ఉండగా ఇప్పట్లో బోటు వెలికి తీయరని నిరాశతో తమ స్వస్థలాలకు వెళ్లిన వారు తిరిగి కచ్చులూరు చేరుకున్నారు. బోటు బయటపడితే తమవారి ఆచూకీ లభిస్తుందన్న ఆశ తో ఆవేదనగా ఆతృతగా తీరం వెంబడి వేచి వున్నారు. తొలి రోజు బోటు బయటకు రాకపోవడంతో మరోసారి అంతా నిట్టూర్చారు. అయితే మరో ఒకటి రెండు రోజుల్లో వెలికితీత విజయవంతం అవుతుందన్న ఆశాభావంతో వున్నారు అంతా. ధర్మాడి సత్యం టీం రెండు ప్లాన్స్ తో ఈ ఆపరేషన్ కి సిద్ధమైంది. తొలి ప్లాన్ పని జరగకపోతే రెండో ప్లాన్ అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇదిలా ఉంటే బోటు ప్రమాదం జరిగిన నాటినుంచి దేశవ్యాప్తంగా సంచలనం అయిన ఈ సంఘటన కావడంతో అందరు ఎప్పుడు రాయల్ వశిష్ఠ బయట పడుతుందా అని ఎదురు చూస్తున్నారు.