ముంబై, అక్టోబరు 1 (way2newstv.com)
బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. సెప్టెంబర్ నెల చివరి రోజు సోమవారం ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి పడిపోయింది. వెండి ధరదీ ఇదే దారి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు ( 22 క్యారెట్లు) 0.93 శాతం క్షీణతతో లేదా రూ.350 తగ్గుదలతో రూ.37,400కు పడిపోయింది. వెండి ఫ్యూచర్స్ ధర కేజీ రూ.909 తగ్గుదలతో రూ.44,608 స్థాయికి దిగొచ్చింది.ఆగస్ట్ 30న గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.38,656 వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ధర కేజీకి రూ.46,742 స్థాయి వద్ద కదలాడింది.
మరింత తగ్గిన బంగారం
సెప్టెంబర్ క్లోజింగ్ రేట్లతో పోలిస్తే ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి.ఇకపోతే సెప్టెంబర్ నెలలో బంగారం ధర కొత్త గరిష్ట స్థాయిలకు చేరింది. వెండి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. బంగారం ధర 10 గ్రాములకు రూ.39,885 స్థాయికి చేరింది. కేజీ వెండి ధర రూ.51,489 స్థాయికి పరుగులు పెట్టింది. అయితే తర్వాత రేట్లు తగ్గుతూ వచ్చాయి. ప్రాఫిట్ బుకింగ్ ఇందుకు కారణం.అటుపైన అంతర్జాతీయ భౌగోళిక అస్థిరతలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, బ్రెగ్జిట్, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు వంటి పలు అంశాల నేపథ్యంలో బంగారం ధర తగ్గుతూ పెరుగుతూ వచ్చింది. భారత్‌లో బంగారం, వెండి ధరలను గ్లోబల్ ట్రెండ్స్ ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.అక్టోబర్ నెలలో బంగారం ధరలను పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. బ్రెగ్జిట్ డెడ్‌లైన్ దగ్గరకు వస్తుండటం, పండుగ సీజన్ నేపథ్యంలో దేశీయంగా డిమాండ్, కేంద్ర బ్యాంక్ మానిటరీ పాలసీ నిర్ణయం, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు వంటి అంశాలు పసిడి ధరను ప్రభావితం చేస్తాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.