కొండ్రు మురళీమోహన్ దారెటు.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొండ్రు మురళీమోహన్ దారెటు..

శ్రీకాకుళం, అక్టోబరు 28, (way2newstv.com)
కొండ్రు మురళీ మోహన్ కు ఇప్పుడు దారి తెలియడం లేదట. ఇప్పటికే ఐదేళ్లపాటు అధికార విరహాన్ని పాటించిన కొండ్రు మురళి ఇక మరో ఐదేళ్లు ఆగితే క్యాడర్ కూడా తన వెంట నిలవదని ఆందోళన చెందుతున్నారట. అందుకోసమే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ వైసీపీ అధినేత జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. కొండ్రు మురళి మోహన్ ను వైసీపీలో చేర్చుకుంటే ఉపయోగం కొంత ఉంటుందనేది వైసీపీ సీనియర్ నేతల అభిప్రాయంగా విన్పిస్తుంది.కొండ్రు మురళి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 
కొండ్రు మురళీమోహన్ దారెటు..

కాంగ్రెస్ మంత్రి వర్గంలోనూ ఆయన పనిచేశారు. దళిత యువ నాయకుడిగా కొండ్రు మురళి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. అయితే రాష్ట్ర విభజన కాంగ్రెస్ చేయడంతో కొండ్రు మురళి ఫేట్ మారిపోయింది. 2014 ఎన్నికల్లో పార్టీ మారాల్సి ఉన్నా ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. దీంతో రాజాం నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత కొంత కాలం కాంగ్రెస్ లో కొనసాగిన కొండ్రుమురళి ఎన్నికలు ఏడాది ఉండగా ఆయన వైసీపీలో చేరేందుకు తొలుత ప్రయత్నించారు. అయితే రాజాం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంభాల జోగులు ఉండటంతో ఆ టిక్కెట్ ఇవ్వలమేని అధిష్టానం తెగేసి చెప్పింది. మరో నియోజకవర్గం అయితే ఓకే అని సిగ్నల్స్ పంపింది. కానీ రాజాం నియోజకవర్గంపైనే మమకారం పెట్టుకున్న కొండ్రుమురళి చివరకు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక్కడ కూడా టిక్కెట్ ఇస్తానని హామీ ఉంటేనే చేరతానని చెప్పడంతో చంద్రబాబు టిక్కెట్ ఇచ్చేందుకు అంగీకరించారు. అప్పటి వరకూ రాజాం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న ప్రతిభా భారతిని పక్కన పెట్టి కొండ్రు మురళికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఈసారి కూడా ఓటమి తప్పలేదు.రాజాం రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో వైసీపీకి గత రెండు ఎన్నికల నుంచి కంచుకోటగా మారింది. ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి కూడా దారుణంగా ఉందని గమనించిన కొండ్రు మురళి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా ఆయన హాజరుకావడం లేదు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేసినట్లే నని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తన ఓటమికి టీడీపీ నేతలు ప్రతిభాభారతి, కళా వెంకట్రావులు కారణమని కొండ్రు మురళి వర్గం బహిరంగంగా ఆరోపిస్తుంది. మొత్తం మీద టీడీపీలో కొండ్రు మురళి ఎపిసోడ్ ఇక ముగిసినట్లేనని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం.