10 రోజుల్లో కీలక తీర్పులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

10 రోజుల్లో కీలక తీర్పులు

న్యూఢిల్లీ, నవంబర్ 2  (way2newstv.com)
రాబోయే పది రోజుల్లో దేశ గతిని మార్చే కీలక తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించనుంది. నవంబరు 4 నుంచి పది రోజుల్లోపు అయోధ్య సహా కీలక కేసుల్లో తీర్పులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ వెలువరించనున్నారు. శతాబ్దం కాలం నుంచి సామాజిక-మతపరమైన అంశంతో ముడిపడిన అయోధ్య వివాదంపై సుప్రీం వెల్లడించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఈ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ రోజువారీ విచారణ ఇటీవలే పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.చరిత్రాత్మక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో నిర్ణయం వెలువరిస్తుందా? లేక భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయా? అనే అంశంపై చర్చ తీవ్రంగా సాగుతోంది. 
10 రోజుల్లో కీలక తీర్పులు

అయోధ్యలో 1934 నాటి అల్లర్లు సందర్భంగా బాబ్రీ మసీదుపై దాడిజరిగింది. ఈ సందర్భంగా మసీదు పాక్షికంగా దెబ్బతినగా, నాటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలోని హిందువుల నుంచి జరిమానా వసూలు చేసి ఆ సొమ్ముతో దానిని పునరుద్దరించింది. అయితే, 1950 తర్వాత మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. 1950 డిసెంబరు 22-23 తేదీల్లో రాముడి విగ్రహాలను మసీదు మధ్యలో ఉంచి హిందువులు ప్రార్థనలు నిర్వహించారు.బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించుకునే హక్కు కల్పించాలని కోరుతూ 1950లో గోపాల్ సింగ్ విశారద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత నిర్మోహీ అఖారా, సున్నీ వక్ఫ్ బోర్డులు కూడా వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఏడు దశాబ్దాలుగా సాగుతోన్న కోర్టు కేసు.. సుప్రీం తీర్పుతో కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.ఇక, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది ఫిబ్రవరి 6న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. దీనిపై కూడా విచారణ పూర్తిచేసిన త్రిసభ్య ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో తీర్పును వచ్చే వారం సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించనుంది.అలాగే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు, సీబీఐ డైరెక్టర్ల మధ్య వివాదంపై కూడా తీర్పు వెల్లడికానుంది. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశం నిషేధం. దీనిపై మహిళ హక్కుల కార్యకర్తలు దాఖలుచేసిన పిటిషన్లను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 4-1తో వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.అయితే, ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హొత్రా మాత్రం మిగతా సభ్యుల తీర్పుతో ఏకీభవించలేదు. 10 నుంచి 45 ఏళ్లలోపు మహిళలను శబరిమలలోకి అనుమతించడం అంటే మత సంప్రదాయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. దీన్ని మహిళా వివక్షగా చూడరాదని అన్నారు.