ముషిరాబాద్ డిపోలో 100 శాతం బంద్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముషిరాబాద్ డిపోలో 100 శాతం బంద్

హైద్రాబాద్, నవంబర్ 21, (way2newstv.com)
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఒక బస్‌ డిపో కొత్త రికార్డు సృష్టించింది. సమ్మె మొదలైన 47 రోజుల్లో ఆ డిపో నుంచి ఒక్కబస్సూ రోడ్డెక్కలేదు. రాష్ట్రంలో 97 బస్‌ డిపోలు ఉండగా.. 96 చోట్ల ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఏదోలా బస్సులను తిప్పుతోంది. కానీ, ముషీరాబాద్‌–2 బస్సు డిపోలోని 140 బస్సులకు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రావడంలేదు. 
ముషిరాబాద్ డిపోలో 100 శాతం బంద్

హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు సమీపంలో ఉన్న ఈ డిపోలోని 140 బస్సులను జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 2012లో కేంద్రం మంజూరు చేసింది. టాటా కంపెనీ రూపొందించిన ఆ బస్సులు సాధారణ బస్సులకు కాస్త భిన్నం. వీటిని నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సాధారణ బస్సులు నడిపే అనుభవం ఉన్న డ్రైవర్లు వీటిని నడపటానికి ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఈ బస్సుల మన్నిక అంతంతే. ప్రస్తుతం కండీషన్‌ తప్పిన ఆ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని డిపోలోనే ఉంచేశారు. ఫలితంగా సమ్మె కాలంలో ఆ డిపో నుంచి ఒక్క బస్సూ గేటు దాటలేదు.