విజయనగరం, నవంబర్ 22 (way2newstv.com)
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదనే కుల వివాదం ఆమె ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుండి కొనసాగుతూనే ఉంది . విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పుష్పశ్రీ వాణి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఏకంగా మహిళా డిప్యూటీ సీఎంగా ఆమెకు అవకాశం కలిపించారు సీఎం జగన్. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగానూ, డిప్యూటీ సీఎం గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స గతంలోనే ఆరోపించిన విషయం తెలిసిందే.. ఆమె కులానికి సంబంధించినటువంటి కేసు కోర్టు విచారణలో ఉందని, అలాంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ మంత్రివర్గంలోకి ఏవిధంగా తీసుకుంటారని ఆయన గందరగోళం చేశారు.
కుల వివాదంలో పుష్ప శ్రీవాణి
చెల్లుబాటు కాని కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని ఆమె ఎన్నిక రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు హైకోర్టుకెక్కారు. దీంతో హైకోర్టు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంకు నోటీసులు జారీ చేశారు.ఎస్టీ కోటాలో డిప్యూటీ సీఎం అయిన పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని పుష్ఫ శ్రీవాణిపై ఆమెకు ప్రత్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. సింహాచలం బీజేపీ అభ్యర్థి ఎన్.జయరాజు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. పుష్ప శ్రీవాణి ‘కొండదొర'గా పేర్కొంటూ ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందారని కానీ అది చెల్లుబాటు కాదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.దీనిపై విచారించిన హైకోర్టు పుష్ఫ శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది. ఆమె వివరణ చూశాక దీనిపై తదుపరి విచారణ చెయ్యనుంది.ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన విజయనగరం జిల్లా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పుష్ప శ్రీ వాణి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఇచ్చిన దృవీకరణ పత్రాల ఆధారంగా ఆమెపై కోర్టుకు వెళ్ళారు. అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన నిబంధన ఉన్నా పుష్ప శ్రీ వాణి 2013నాటి ధృవపత్రాన్ని నామినేషన్ సమయంలో సమర్పించారని ఆరోపించారు. ఇక దానిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇక ఈనేపథ్యంలో ఆమెకు నోటీసులు పంపి వివరణ కోరింది హైకోర్టు.