ఆయనకు కేవీపీ..ఈయనకు విజయసాయి రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆయనకు కేవీపీ..ఈయనకు విజయసాయి రెడ్డి

విజయవాడ, నవంబర్ 4, (way2newstv.com)
సీపీకి ఎందరు ఉన్నా కూడా ఒకే ఒక్కడు మాత్రం విజయసాయిరెడ్డి. ఆయన జగన్ ఆత్మగా మారిపోయారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వంలో కేవీపీ రామచంద్రరావు ఆత్మగా ఉండేవారు. ఇపుడు ఆ స్థానంలోకి విజయసాయిరెడ్డి వచ్చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ని పక్కన పెడితే 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో పాతిక మంది వరకూ మంత్రులు ఉన్నారు. ఇక పార్టీ పరంగా సీనియర్ నాయకులు ఉన్నారు. పెద్ద గొంతుక కలిగిన అధికార ప్రతినిధులు చాలానే ఉన్నారు. మరి వీరెవ్వరూ చూపని చొరవ, వాడీ వేడీ ఒక్క విజయసాయిరెడ్డిలోనే కనిపిస్తాయి. జగన్ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ ఒక్క మాట అననీయడు కదా ఈగ కూడా వాలనీయడు. ఎవరైనా విమర్శ చేస్తే చాలు పెద్ద పులిలా విరుచుకుపడిపోతాడు ఈ నెల్లూరు పెద్దాయన. ఒక విధంగా విజయసాయిరెడ్డి ఒక్కడుంటే వేయి ఏనుగుల బలం వైసీపీకి అని ప్రత్యర్ధులు కూడా అంటున్నారంటే ఈ మాజీ ఆడిట‌ర్ పవర్ ఏంటో అర్ధమవుతుంది.
యనకు కేవీపీ..ఈయనకు విజయసాయి రెడ్డి

వైఎస్ కుటుంబంతో తరాలు ఎరగని బంధాన్ని పెనవేసుకున్న విజయసాయిరెడ్డి జగన్ కి కష్టాల్లో, నష్టాల్లో నీడలా ఉన్నారు. ఆయనతో పాటు పదహారు నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ రోజు వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నా కూడా అది విజయసాయిరెడ్డిపై జగన్ పెంచుకున్న నమ్మకం. దానికి నిలువెత్తు నిదర్శనంగా విజయసాయిరెడ్డి కూడా ఉంటున్నారు. ఓ విధంగా వైసీపీకి అసలైన వ్యూహాకర్త ఆయన. వైసీపీకి ఘనమైన విజయాన్ని తెచ్చిపెట్టిన అపర తిమ్మరుసుగా కూడా చెప్పుకోవాలి. జగన్ ని ముఖ్యమంత్రి కుర్చీలో చూడాలన్న ఆయన కోరిక గట్టి పట్టుదల మీద నెరవేర్చుకున్నారు. పార్టీని గాడిలో పెట్టడంతో పాటు, ఢిల్లీ సంబంధాలను కలుపుకురావడంలోనూ విజయసాయిరెడ్డి సామర్ధ్యమే వేరు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు సైతం విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉంటే గుండెళ్లో గుబులు పుడుతుందని అంటారు. నాలుగేళ్ళ పాటు పచ్చగా ఉన్న బీజేపీ, టీడీపీ బంధాన్ని చిచ్చు పెట్టి మరీ రెండు ముక్కలు చేసిన చాతుర్యం కూడా విజయసాయిరెడ్డిదంటే అతిశయోక్తి కాదేమో.విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే చాలు చంద్రబాబు మీద భారీ అటాక్ జరిగినట్లే. మాటలతోనే మంటలు పుట్టించే విజయసాయిరెడ్డి ట్విట్టర్ ట్వీట్ కి ఎంత పవర్ ఉందో అక్షరాలా నిరూపించేశారు. ఇక ఆయన సభల్లో మాట్లాడితే చాలు టీడీపీ ని విమర్శల జడివాన కురిసినట్లే. విశాఖ సభల్లో విజయసాయిరెడ్డి బాబు మీద సెటైర్లు వేస్తూ మీది పుత్ర రత్న పాలన, మాది నవరత్న పాలన అంటూ క్యాచీ కామెంట్స్ చేశారు. బాబు సొంత పుత్రుడు ఒక చోట, దత్తపుత్రుడు పవన్ రెండు చోట్ల ఓటమిపాలైతే పెద్దాయనకు కన్నీరు రాకుండా ఉంటుందా అంటూ వేసిన పంచ్ లకు తమ్ముళ్లకు మైండ్ బ్లాక్ అవుతోంది. అయిదేళ్ల నిర్వాకం చాలక అయిదు నెలల పాలన మీద ఎందుకు ఏడుపు బాబూ అంటూ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూంటే టీడీపీ తమ్ముళ్ళకు సిగ్గు పోతోందట. పొమ్మంటున్న బీజేపీ చూరు పట్టుకుని పొత్తులు అని వేలాడుతున్నారంటూ పసుపు పార్టీ మీద వేసిన కౌంటర్లకు టీడీపీ దగ్గర సమాధానం నిల్. ఇంత ధాటీగా వైసీపీ నుంచి విరుచుకుపడే మొనగాడు మరొకరు లేకపోవడం వైసీపీకి మైనస్ అనే చెప్పాలి. అదే టైంలో విజయసాయిరెడ్డి లాంటి నేత మా వైపు ఉంటే చాలదా అని ప్రత్యర్ధి పార్టీలు ఆయన చిత్తశుద్ధిని డొక్క శుధ్ధిని కొనియాడుతాయంటే చాలదా రెడ్డి గారి విజయం ఏ రేంజిలో ఉందో.