ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న ఇంటిదొంగలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న ఇంటిదొంగలు

మాయమవుతున్న డీజిల్
గుంటూరు, నవంబర్ 3, (way2newstv.com)
ఆర్‌టిసి బస్సుల్లో డీజిల్‌ ట్యాంకుల నుండి ఆయిల్‌ మాయం చేస్తున్న ముఠా యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.. అపహరణకు గురవుతున్న ఆయిల్‌కు డ్రైవర్లే బాధ్యత వహించి డిపో యాజమాన్యానికి పోయిన ఆయిల్‌ ఖర్చును చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మార్గాల్లో బస్సులను నడపలేమని డ్రైవర్లు చేతులెత్తేశారు. దీంతో డిపో మేనేజర్‌పై ప్రయాణీకులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో దొంగిలించబడిన ఆయిల్‌ కిమ్మత్తును గ్రామస్తులు భరించి యాజమాన్యానికి చెల్లిస్తే తప్పా! తాము బస్సులను నడపలేమని, డ్రైవర్లు ఖరాఖండిగా చెబుతున్నారు. నిరంతరం తెనాలి డిపో నుండి భట్టిప్రోలు, ఐలవరం గ్రామాలకు నైట్‌ హాల్ట్‌ బస్సులు తిరుగుతుంటాయి. తెనాలిలో 10 గంటలకు బయలుదేరిన బస్సులు ఈ గ్రామాలకు చేరే సమయానికి 11 నుండి 11.30 గంటల వరకు సమయం పడుతుంది. 
ఆర్టీసీ బస్సుల్లో  పెరుగుతున్న ఇంటిదొంగలు

అక్కడ నుండి డ్రైవర్‌, కండక్టర్‌ విశ్రాంతి తీసుకునేందుకు ఉపక్రమిస్తారు. సుమారు రెండు గంటల సమయంలో ఓ ముఠా నిద్రమత్తులో ఉన్న డ్రైవర్‌ పరిస్థితిని గమనించి చాకచక్యంగా ఆయిల్‌ ట్యాంకు నుండి గుట్టు చప్పుడు కాకుండా డీజిల్‌ను తీసుకెళుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఐలవరంలో రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా ఆర్‌టిసి బస్సులోని ఆయిల్‌ ట్యాంకు నుండి 90 లీటర్లకు పైగా డీజిల్‌ను దొంగిలించారు. ఇదే రీతిలో 15 రోజుల కిందట భట్టిప్రోలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉంచిన నైట్‌ హాల్ట్‌ బస్సు ట్యాంకరులో ఉన్న దాదాపు 70 లీటర్ల ఆయిల్‌ను దొంగిలించారు. ఇదిలా ఉండగా 20 రోజుల కిందట కొల్లూరు మండలం జువ్వలపాలెంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. వరుస ఘటనలతో ఆర్‌టిసి డ్రైవర్లు, కండక్టర్లు అవాక్కవుతున్నారు. నిరంతరం చోటుచేసుకుంటున్న ఆయిల్‌ దొంగతనాలతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు ఇదిలా ఉండగా జువ్వల పాలెంలో అపహరణకు గురైన ఆయిల్‌కు గ్రామస్తులే స్వచ్ఛందంగా ఆయిల్‌ కిమ్మత్తును చెల్లించడంతో ఆ రూట్‌లో నైట్‌ హాల్ట్‌ బస్సులను ఆర్‌టిసి యాజమాన్యం యథావిధిగా కొనసాగిస్తుంది. ఇదే రీతిలో ఐలవరంలో పోయిన ఆయిల్‌ ఖర్చులను గ్రామస్తులు భరిస్తేనే ఈ గ్రామానికి బస్సులను నడుపుతామని, లేకుంటే ఆ గ్రామానికి బస్సులను తిప్పే పరిస్థితి లేదని డ్రైవర్లు, కండక్టర్లు పట్టుపట్టడంతో ఆ మేరకు ప్రజలు ఏమి చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉండగా సాక్ష్యాత్తు పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే బస్సులో నుండి దొంగిలించబడిన ఆయిల్‌కు సొమ్మును ఎవరు చెల్లించాలనే మీమాంసలో పడ్డారు. ఓ ప్రక్క బస్సు డ్రైవరు, మరో ప్రక్క పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉన్నందుకు స్టేషన్‌ ఎస్‌ఐ లేక సిబ్బంది కలిసి దానిని చెల్లించాలని పట్టుపట్టినట్లు తెలిసింది.ఆర్‌టిసి బస్సులో డీజిల్‌కే రక్షణ లేకపోతే మండలం లోని మారుమూల గ్రామాల్లో సైతం రాత్రి వేళల్లో వాహనాలు, ఇతర సామాగ్రికి ఎలాంటి రక్షణ ఉంటుందని ఆయా ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. సాక్ష్యాత్తు పోలీసులు విధులు నిర్వర్తించే పోలీసుస్టేషన్‌ ముందున్న బస్సులో ఆయిల్‌ దొంగిలిస్తే మిగతా ప్రాంతాల్లో పోలీసులు ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. రానున్న వేసవి కాలం దృష్ట్యా గతంలో జరిగిన దొంగతనాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే పోలీసు నిఘాను ఏర్పాటు చేసి దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.