బెంగళూర్, నవంబర్ 1 (way2newstv.com)
కర్ణాటకలో జనతాదళ్ ఎస్ గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ దెబ్బకు పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలో పట్టుకుంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఉన్న 14 నెలలు కుక్కిన పేనుల్లా ఉన్న ఎమ్మెల్యేలు స్వరం పెంచుతున్నారు. ఆపరేషన్ కమలం వైపు జేడీఎస్ ఎమ్మెల్యేలు పరుగులు తీసే సూచనలు కన్పిస్తున్నాయి. పార్టీకి భవిష్యత్ లేదని భావించి ఎమ్మెల్యేలు ఇతర పార్టీల బాట పడుతున్నారు.దీంతో కుమారస్వామి బీజేపీకి అనుకూలంగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ చేజారిపోకుండా ఉండేందుకే కుమారస్వామి బీజేపీ అనుకూల ప్రకటనలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
పెరుగుతున్న జనతాదళ్ ఎమ్మెల్యేల స్వరం
రాష్ట్రంలో యడ్యూరప్ప సర్కార్ కు ఇప్పట్లో వచ్చే ముప్పు లేదని కుమారస్వామి తేల్చి చెప్పారు. ఉప ఎన్నికలు మరికొద్దిరోజుల్లో జరుగుతున్న సమయంలో కుమారస్వామి ఈ మేరకు వ్యాఖ్యానించడం పార్టీని కూడా ఇబ్బందుల్లో నెట్టేసింది.కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు డిసెంబరు 5వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. యడ్యూరప్ప ప్రభుత్వం పతనం అంచున ఉంది. పదిహేను అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కనీసం ఎనిమిది స్థానాలను గెలుచుకోవాల్సిన పరిస్థితి. అయితే జేడీఎస్, కాంగ్రెస్ గట్టిగా పోరాడితే బీజేపీ సర్కార్ ను ప్రభుత్వం నుంచి దించేసే వీలుంది. కాంగ్రెస్ ఈ మేరకు శక్తి వంచన లేకుండా పోరాడుతోంది. జేడీఎస్, కాంగ్రెస్ కలిస్తేనే తిరిగి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు సాధ్యమవుతుంది. ఇది కుమారస్వామికి తెలియంది కాదు.కానీ కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేవిగానే ఉన్నాయి. ఉప ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధించలేకపోయినప్పటికీ తాము మద్దతిస్తామని కుమారస్వామి చేసిన ప్రకటన కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీసవిధంగా ఉన్నాయి. కుమారస్వామి కూడా తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ఈ ప్రకటన చేశారంటున్నారు. తాజాగా జేడీఎస్ ఎమ్మెల్సీ పుట్టణ్ణ సయితం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. మరికొందరు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియడంతోనే కుమారస్వామి తన స్వరం మార్చుకున్నారని చెబుతున్నారు