అన్నదాతలకు తుఫాను టెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నదాతలకు తుఫాను టెన్షన్

విజయవాడ, నవంబర్ 6, (way2newstv.com)
నవంబర్ నెల తలుచుకుంటేనే అన్నదాతల వెన్నులో వణుకు మొదలవుతోంది. ఎందుకంటే  15 సంవత్సరాలుగా ఈ నెలలోనే పెద్ద ఎత్తున వర్షాలు, తుఫానులు సంభవిస్తుంటాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఎక్కడ నీటిపాలవుతాయోనని రైతన్నల్లో గుబులు పట్టుకుంది. ఈ ఏడాది కూడా బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. జిల్లాలో పలుచోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి ఆకాశం మేఘావృతమవుతోంది. నాలుగు రోజుల నుండి జిల్లాలో అక్కడక్కడ చినుకులు కురిశాయి. తలుపుల మండలంలో, కదిరి రూరల్ పట్నం గ్రామాల్లో  ఒక పదును వర్షం కురిసింది. రానున్న రెండు, మూడు జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 
అన్నదాతలకు తుఫాను టెన్షన్

దీంతో వేరుశెనగ పంట కోతకు వస్తున్న దశలో ప్రకృతి విపత్తు సంభవిస్తే నిలువునా మునిగిపోతామని అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. జిల్లా వ్యాప్తంగా గతంలో మొత్తం 8.50 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ సాగుచేసే వారు. రానురాను సగటున 6.50 లక్షల హెక్టార్లు వరకు సాగుకు వచ్చింది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో 5.30 లక్షల హెక్టార్ల వరకు మాత్రమే వేరుశెనగ సాగైంది. కాగా విత్తనాలు పొలంలో వేసినప్పటి నుంచి చెట్లు దంతులు పట్టే వరకు మాత్రమే జిల్లాలో పలుచోట్ల వర్షాలు ఓ మోస్తారు పడ్డాయని చెప్పవచ్చు. కొన్ని మండలాల్లో వరుణుడు మొహం చాటేయడంతో మొలక దశలోనే పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ పంట నష్టాన్ని అంచనా వేస్తే దాదాపు 4.20 లక్షల హెక్టార్ల వరకు భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది రైతులు వేరుశెనగ పంట సాగు చేస్తూ ఏదో విధంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది అరకొరగా పండిన వేరుశెనగ పంట వారం, పది రోజుల్లో కోతకు వస్తుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ నెలలో వర్షాలు, తుఫానులు తగులుకుంటే అరకొరగా పండిన పంట సైతం చేతికందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక ఎకరా పొలంలో వేరుశెనగ పంట సాగు చేయాలంటే దాదాపు రూ. 16 వేలు ఖర్చు వస్తుంది. ఎంత ఖర్చైనా పర్వా లేదు అప్పులు చేసి పంట సాగు చేసుకుంటే ఆ దేవుడు తమ తలరాత మార్చి పంట ఆశాజనకంగా పండిస్తాడని గంపెడు ఆశలతో వున్న రైతుల బతుకులు ఈ ఏడాది కూడా ప్రశ్నార్థకంగా మారాయి. కొద్దోగొప్పో పంట బాగుందనుకుంటే వాతావరణంలో మార్పులు వచ్చి ప్రకృతి సహకరించడం లేదు. ప్రస్తుతం వేరుశెనగ పంట కోత దశకు వచ్చిందని, ఎక్కడ వర్షాలు పడి నష్టం వాటిల్లుతుందోననే ఆందోళన రైతులను వెంటాడుతోంది. వాస్తవంగా వర్షాధారం కింద సాగు చేసిన వేరుశెనగ పంట కోత కోసం నీటి తడులు అవసరం. పంట కోతకు ఒక పదును వర్షం పడితే సరిపోతుంది. అలాకాకుండా వరుసగా వర్షాలుకానీ, తుఫానుగానీ పట్టుకుంటే వేరుశెనగ పంట మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టాపోవాల్సి వస్తుంది. ఇదిలా వుండగా కంది పంట ప్రస్తుతం పూత దశకు చేరుకుంది. వేరుశెనగ పంట పెద్ద దెబ్బతీసినప్పటికీ ప్రస్తుతం కంది పంట మాత్రం ఆశాజనకంగా ఉంది. కంది చెట్లకు పువ్వు విరగ్గాసింది. అనుకున్నట్లు ఈ నెలలో వర్షాలు పడితే పూతంతా రాలిపోయి పంటకు పెద్ద దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఇక బోరు బావుల కింద సాగు చేసిన వరిమడుల పరిస్థితి కూడా ఇదే. కాగా పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ వాతావరణం మార్పుల కారణంగా కాలం కాని కాలంలో ఎండలు, వర్షాలు, తుఫానులు, ఈదురు గాలులు వస్తున్నాయి.  ప్రధానంగా నవంబరు నెల అంతా తుఫానుల మయంగానే ఉంటోంది. ఒక్కో సందర్భంలో వారంలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడి తుఫానులుగా మారుతున్నాయి. 2003 సంవత్సరం నుంచి ఇదే వరుస. పంటలు కోత దశకు వచ్చిన సమయంలోనే వర్షాలు చుట్టుముట్టి పంటను నాశనం చేస్తాయేమోనని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. పంట చేతికందితే చేసిన అప్పులకు వడ్డీలైనా కట్టుకుందామనే ఆశతో రైతులు ఉన్నారు. కాగా ఈ నెలలో తుఫాను ఏమైనా పట్టుకుంటే పంటలు తీవ్రంగా నష్టపోయి జిల్లా రైతాంగం భారీగా వలస బాట పట్టే ప్రమాదం ఉంది.