గుంటూరు, నవంబర్ 6, (way2newstv.com)
యరపతినేని శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. 2009, 2014 ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం నుంచి వరుస విజయాలు కైవసం చేసుకుని తనదైన శైలిలో ఇక్కడ యరపతినేని శ్రీనివాసరావు చక్రం తిప్పారు. అయితే, అదేస మయంలో ఆయన అనేక కేసుల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా లేటరైట్ సున్నపుగనుల విషయంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలను యరపతినేని శ్రీనివాసరావు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయనపై సీబీఐ కేసులు, కోర్టు విచారణలు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పట్టుబట్టి గురజాలలో యరపతినేని శ్రీనివాసరావుని ఓడించింది.
యరపతినేని ప్లాన్ ఏంటీ
ఈ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి.. ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించి యరపతినేనికి చెక్ పెట్టారు.బలమైన రాజకీయ వారసత్వం ఉన్న కాసు మహేష్ రెడ్డిని రంగంలోకి దించి.. యరపతినేని శ్రీనివాసరావుపై తాజా ఎన్నికల్లో పోటీపెట్టారు. కీలక నాయకులు ఇక్కడ పర్యటించి ప్రచారం కూడా చేశారు. వైసీపీ అధినేత జగన్ కూడా పాదయాత్ర సమయంలో ఇక్కడ పర్యటించి కాసుకు అనుకూలంగా ప్రచారం చేశారు. ఫలితంగా తానే మూడో సారి కూడా విజయం సాధిస్తాననే ప్రకటనలు చేసి, భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్న యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ వ్యూహం ముందు బోల్తా పడ్డారు. సరస్వతి భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్ తనను టార్గెట్ చేశారని యరపతినేని శ్రీనివాసరావు ప్రచారం చేసుకున్నా ఎక్కడా అది ఫలించలేదు. మరోపక్క, సీబీఐ కేసులు నమోదు చేయడానికి కూడా వైసీపీ తెరచాటుగా చేసిన ప్రయత్నాలే కారణమనేది నిర్వివాదాంశం. ఎన్నికల్లో ఓటమి అనంతరం మరిన్ని కేసులు చుట్టుముడతాయేమోనని భావించిన యరపతినేని శ్రీనివాసరావు అప్పటి నుంచి మౌనం వహించారు. పార్టీ అధినేతతో టచ్‌లో ఉన్నా..ఎప్పుడూ కూడా బహిరంగంగా గతంలో విమర్శించినట్టు వైసీపీపై ఎక్కడా నోరు జారడం లేదు. జగన్‌పైనా.. వైసీపీపైనా.. విజయసాయిపైనా యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు తరచుగా మీడియా సమావేశం పెట్టి ఉతికి ఆరేశారు. అయితే, తర్వాత మారిన సమీకరణల నేపథ్యంలో ఆయన మౌనం వహించారు. మరోపక్క, టీడీపీని వీడి వైసీపీలో నాయకులు చేరిపోతుండడం, గుంటూరు జిల్లాను టార్గెట్ చేసుకున్న వైసీపీ నేతలు ఇక్కడ టీడీపీని మట్టికరిపించాలనే వ్యూహంతో ముందుకు సాగిన నేపథ్యంలో యరపతినేని శ్రీనివాసరావు ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు.అయితే, ఇప్పుడు ఎన్నికలు ముగిసిన ఐదు మాసాల తర్వాత యరపతినేని శ్రీనివాసరావు మళ్లీ తన విశ్వరూపం చూపించేందుకు రెడీ అయ్యారనే వార్తలు సంచలనంగా మారాయి. తాజాగా టీడీపీ నిర్వహించిన భవన నిర్మాణ కార్మికులకు అనుకూల ధర్నాలో యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం ముందు ఆయన హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పల్నాడులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంలోనూ యరపతినేని శ్రీనివాసరావు దూకుడుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. మరి ఒక్కసారిగా యరపతినేని శ్రీనివాసరావులో ఇంత మార్పు ఎలా వచ్చింది ? ఇప్పుడు ఎందుకు ఇలా నిరసనలకు రెడీ అయ్యారు ? అనే ప్రశ్నలు సాధారణంగానే తెరమీదికి వస్తాయి.అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం కొన్నాళ్ల పాటు టీడీపీలో స్తబ్దత వాతావరణం కనిపించింది. ఓటమిని జీర్ణించుకోవడం, నాయకులను ఎలా నిలబెట్టుకోవాలనే విషయాల్లో అధినేత చంద్రబాబే తర్జన భర్జన పడ్డారు. అయితే, తర్వాత బాబు పుంజుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడం, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, బాధితుల పక్షాన నిలవడం ద్వారా ఈ ఓటమి బాధను అధిగమించవచ్చని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా ఆత్మకూరు బాధితుల పక్షాన నిలిచారు. పోరాటాలు చేశారు. తాజాగా నిర్మాణ రంగ కూలీల పక్షాన నిలిచారు. ఈ క్రమంలోనే బాబు బాటలో నడవాలని నిర్ణయించుకున్న యరపతినేని శ్రీనివాసరావు కూడా తనపై ఉన్న కేసులను పక్కన పెట్టి ప్రజల్లోకి వస్తున్నారని, అటు వైసీపీ ప్రభుత్వంపై పోరాటాలు చేయడం ద్వారా హైలెట్ అవ్వాలన్నదే యరపతినేని శ్రీనివాసరావు లక్ష్యంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. సీబీఐ కేసులు తననేం చేయవన్న ధైర్యంతో యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. సో.. మొత్తానికి యరపతినేని శ్రీనివాసరావు దూకుడు వెనుక బాబు వ్యూహం కనిపిస్తోందన్నమాట..!