అక్షయ పాత్రకు మంగళం..? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్షయ పాత్రకు మంగళం..?

విశాఖపట్టణం, నవంబర్ 9, (way2newstv.com)
ఈ ఏడాది మే 1వ తేదీకి ముందు ఐసిడిఎస్‌ భీమిలి ప్రాజెక్ట్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏ విధంగానైతే ఆయాలచే వేడి వేడి పప్పన్నం, పౌష్టికాహారం పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు అందేదో అదే మాదిరిగా ప్రస్తుతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని 232 అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా బాధ్యతను ఈ ఏడాది మే 1వ తేదీన అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తూ గత టిడిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భీమిలి అర్భన్‌, రూరల్‌ పరిధిలోని 100 కేంద్రాలకు, ఆనందపురం మండలంలోని 75 కేంద్రాలకు, పద్మనాభం మండలంలోని 57 కేంద్రాలకు పౌష్టికాహారాన్ని ఆ సంస్థ సరఫరా చేస్తూ వస్తోంది. సంబంధిత కేంద్రాల్లో 1420 మంది బాలింతలు, 1453 మంది గర్భిణులు, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు వయస్సు గల పిల్లలు 6 వేల173 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 2,620 మంది ఉన్నారు. 
అక్షయ పాత్రకు మంగళం..?

వీరికి గుడ్లు, పాలు ప్రభుత్వమే ఎప్పటిలాగే సరఫరా చేస్తూ ఉంది. నెలలో 25 రోజులపాటు అన్నం, కూర, సాంబారు, పప్పు, ఆకు కూరలు మాత్రం వండి సరఫరా చేసే పని అక్షయ పాత్రకు అప్పగించింది. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది.సకాలంలో భోజనం కేంద్రాలకు చేరకపోవడం, వచ్చిన అన్నం ఒక్కోసారి నాణ్యత లేకుండా ఉండడం, నీళ్లలా సాంబారు, పప్పు దినుసులు లేని కూర అక్షయపాత్ర సరఫరా చేస్తుండడంతో గర్భిణులు, బాలింతలు సంబంధిత ఆహారాన్ని తినేందుకు ఇష్టపడేవారు కాదు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇంటి వద్ద వండిన వేడి వేడి అన్నం అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువెళ్లి పిల్లలకు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని కేంద్రాల్లో పిల్లల్నే ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి మరలా కేంద్రాలకు తీసుకొచ్చిన సందర్భాలూ లేకపోలేదు. గత ప్రభుత్వం అక్షయపాత్రతో కుదర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేయాలంటూ సిఐటియు, ప్రజా సంఘాలు అంగన్‌వాడీ కేంద్రాల తల్లులు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆ సంస్థకు ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా నవంబర్‌ 1వ తేదీ నుంచే యథావిధిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎప్పటిలాగానే ఆయాలతో వండి పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే అనేక కేంద్రాలకు ఇప్పటికే బియ్యం స్టాకును పంపించారు. మరో రెండు రోజుల్లో పప్పు దినుసులు కూడా పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.ఐసిడిఎస్‌ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇకనుంచి మెనూ సక్రమంగా అమలయ్యే అవకాశాలున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ వారం రోజులు 6 రోజులు గుడ్లు, 200 గ్రాములు పాలు ఇస్తున్నారు. రక్తహీనత ఉన్న తల్లులకు ఖర్జూరం, వేరు శెనగ చెక్కీలు, రాగిపిండి, బెల్లం అందిస్తున్నారు.గతంలో దాదాపు ఎక్కువ శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్‌ స్టౌవ్‌లు, వంటపాత్రలు ప్రభుత్వం సరఫరా చేసింది. ప్రస్తుతం అవి వినియోగంలోకి రానున్నాయి. అయితే కొన్ని కేంద్రాలను విలీనం చేయడం ద్వారా ఒకే చోట వంటలు వండిందుకు అసౌకర్యం కలగనుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.