అలిపిరి దగ్గర భద్రత డొల్లేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అలిపిరి దగ్గర భద్రత డొల్లేనా

తిరుమల, నవంబర్ 29, (way2newstv.com)
టీటీడీ భద్రతా నిబంధనల ప్రకారం టోల్‌గేట్‌ వద్దకు చేరుకునే ప్రతి వాహనాన్ని వాటిలోని ప్రతి వ్యక్తిని కిందకు దింపి అధునాతన తనిఖీ యంత్రాలు, పరికరాల ద్వారా తనిఖీ చేసి తిరుమలకు అనుమతించాలి. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే టీటీడీ ఉద్యోగులకు సైతం మినహాయింపు లేదు. తిరుమలకు వెళ్లే వాహనాల్లోని లగేజీలను సైతం కొందరివే తనిఖీలు చేసి మిగిలిన వారివి యథేచ్చగా వదిలేస్తున్నారు. ఈ అంశంలో ముఖ్యంగా కొందరు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంతో లగేజీలను వాహనాల్లో నుంచి దించకుండానే తూతూ మంత్రంగా తనిఖీ చేసి వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికుల్లో సగభాగానికి పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. 
అలిపిరి దగ్గర భద్రత డొల్లేనా

వీరిలో సామాన్య భక్తులు, టీటీడీ ఉద్యోగులు, కొందరు కిందిస్థాయి అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. టీటీడీలోని భద్రతా విభాగంలో రూపొందించిన కఠిన నియమాల ప్రకారం బస్సుల్లో ప్రయాణించే డ్యూటీ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ అలిపిరి టోల్‌గేట్‌ వద్ద కచ్చితంగా కిందికి దింపి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ చాలా మంది టీటీడీ కార్మికులు, ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది బస్సుల్లో నుంచి కిందికి దిగి తనిఖీలు చేయించుకోకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులకు భద్రతా సిబ్బంది కల్పిస్తున్నారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా భద్రతా విభాగం ఉన్నతాధికారులు స్పందించి అలిపిరి టోల్‌గేట్‌ వద్ద నిబంధనల మేరకు పటిష్టంగా తనిఖీలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.అయితే టోల్‌గేట్‌ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో భద్రత డొల్లగా మారింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ఉద్యోగులు, సొంత వాహనాల్లో, ట్యాక్సీల్లో వచ్చే వారిని వాహనాల్లో నుంచి దింపకుండానే తూతూ మంత్రంగా తనిఖీలు చేసి పంపేస్తున్నారు. సిఫార్సులుండే వారి వాహనాలకు కనీస తనిఖీలు కూడా లేకుండానే రైట్‌ చెబుతున్నారు.టోల్‌గేట్‌లో ప్రతిరోజూ వేకువజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు షిప్టుల వారీగా పనిచేస్తూ తనిఖీలు నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో నిత్యం వేల సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలకు నిషేధిత వస్తువులైన మాంసం, మారణాయుధాలు, మద్యం, గుట్కా, పాన్‌ ప్యాకెట్లు, పేలుడు పదార్థాలు ఏ మార్గంలోనూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకుండా కట్టడి చేయడమే టోల్‌గేట్‌లో చేపడుతున్న తనిఖీల ప్రధాన ఉద్దేశం.ఆర్టీసీ సిబ్బంది, టీటీడీలోని కొం దరు ఉద్యోగులు, సిబ్బంది తిరుమలకు నిషేధిత మాంసం, మద్యం, గుట్కా ప్యాకెట్లు బస్సుల్లో తీసుకెళ్తూ పట్టుబడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ సంఘటనలపై మీడియాలో వార్తలు వచ్చిన కొన్ని రోజుల వరకు మాత్రమే అధికారులు నానా యాగీ చేసి మిన్నకుండిపోతున్నారు.తిరుమలకు సాధారణ రోజుల్లోనే వాహనాల ద్వారా రోజుకు కనీసం 45– 60వేల మంది వెళ్తుంటారు. అలాంటిది రానున్న పండుగలు, సెలవుల కాలంలో రద్దీ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో అలిపిరి టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు డొల్లతనంగానే కొనసాగితే ఏ పరిస్థితికైనా దారి తీయవచ్చనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనైనా భద్రతను, తనిఖీలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించాలి.