ఇంటర్ బోర్డులో లెక్చరర్స్ క్రమబద్దీకరణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంటర్ బోర్డులో లెక్చరర్స్ క్రమబద్దీకరణ

హైద్రాబాద్, నవంబర్ 9, (way2newstv.com)
స్టూడెంట్లు తక్కువగా ఉన్నారన్న కారణంతో సర్కారీ జూనియర్ కాలేజీల్లో రేషనలైజేషన్కు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇటీవల సర్కారీ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో రేషనలైజేషన్ చేయగా, ఈ మధ్య ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లోనూ చేసింది. ఇప్పుడు సర్కారీ జూనియర్ కాలేజీలపై దృష్టి పెట్టారు ఇంటర్ బోర్డు అధికారులు. మూతపడే కోర్సులు, లెక్చరర్ల బదిలీపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వట్లేదు. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో రేషనలైజేషన్ చేపట్టడంపై లెక్చరర్లు, స్టూడెంట్లు విమర్శిస్తున్నారు. రాష్ర్టంలో 404 సర్కారీ జూనియర్ కాలేజీలుండగా, 41 ఎయిడెడ్ కాలేజీలున్నాయి. మొత్తం కాలేజీల్లో 2 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. 
ఇంటర్ బోర్డులో లెక్చరర్స్ క్రమబద్దీకరణ

అయితే రెండేండ్లుగా విద్యార్థులు తక్కువగా చేరుతున్నారన్న పేరుతో ఆయా కాలేజీల్లోని కోర్సులను మూసేయాలని ఇంటర్బోర్డు అధికారులు భావించారు. కానీ, విద్యార్థి సంఘాలు, లెక్చరర్ల సంఘాలు ఆందోళన చేస్తాయన్న భయంతో వెనక్కి తగ్గారు. అయితే, నెల రోజుల క్రితం సర్కారీ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ప్రభుత్వం రేషనలైజేషన్ చేసింది. తక్కువ స్టూడెంట్లున్న కాలేజీల్లోంచి, ఎక్కువ స్టూడెంట్లున్న కాలేజీలకు 90 మందికిపైగా లెక్చరర్లను బదిలీ చేసింది. స్టూడెంట్లను వేరే కాలేజీల్లోకి మార్చారు. డిగ్రీ కాలేజీల రేషనలైజేషన్ అంతా గుట్టుగా జరగడంతో, ఇంటర్ కాలేజీల రేషనలైజేషన్నూ గుట్టుగానే చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ముందు ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చేసింది. 39 మంది బోధన, బోధనేతర సిబ్బందిని వేరే సర్కారీ, ఎయిడెడ్ కాలేజీల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. స్టూడెంట్లను  దగ్గర్లోని కాలేజీల్లోకి మర్చారు.ఎయిడెడ్ జూనియర్ కాలేజీల రేషనలైజేషన్ తర్వాత ఇంటర్ బోర్డు సర్కారీ జూనియర్ కాలేజీలపై దృష్టి పెట్టింది. కాలేజీల్లోని స్టూడెంట్లు, లెక్చరర్లు, సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. అదనపు సెక్షన్లలోని స్టూడెంట్ల డేటానూ తీసుకుంటోంది. పది మంది స్టూడెంట్లు మాత్రమే ఉన్న కోర్సులను ఎత్తేయాలని భావిస్తోంది. దీంతో చాలా గ్రూపులు మూతపడే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 6,008 జూనియర్ లెక్చరర్ పోస్టులున్నాయి. వీటిలో 917 మందే పర్మినెంట్ లెక్చరర్లు కాగా, మరో 4 వేల మంది వరకూ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 819 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. కోర్టు సాకులు చూపుతూ ప్రభుత్వం ఈ పోస్టులను ఏండ్ల నుంచి భర్తీ చేయట్లేదు. ఇప్పుడు రేషనలైజేషన్ చేస్తే ఆయా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ పెద్దలు, అధికారులు భావిస్తున్నారు. అయితే రేషనలైజేషన్లో భాగంగా మూతపడే కోర్సులను వచ్చే ఏడాది కొనసాగిస్తారా.. లేదా, బదిలీ చేసే లెక్చరర్లను అదే కాలేజీలో ఉంచుతారా, తిరిగి పాత కాలేజీకి పంపిస్తారా అన్న దానిపై మాత్రం ఇంటర్ బోర్డు స్పష్టత ఇవ్వట్లేదు.