హైద్రాబాద్ కు మకాం మార్చేసిన ఆర్జీవీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హైద్రాబాద్ కు మకాం మార్చేసిన ఆర్జీవీ

ముంబై, నవంబర్ 9 (way2newstv.com)
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన మాకాం మార్చాడు. దాదాపు పాతికేళ్లుగా ముంబైలో ఉంటున్న వర్మ, హైదారబాద్‌లో ఆఫీస్‌ తెరిచాడు. నాగార్జున హీరోగా తెరకెక్కిన గోవింద గోవింద సినిమా విషయంలో వివాదం తలెత్తడంతో అలిగిన వర్మ అప్పట్లో తన మకాంను ముంబైకి మార్చేశాడు. బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన వర్మ చాలా కాలం పాటు అక్కడే ఉండిపోయాడు.లాంగ్ గ్యాప్‌ తరువాత నాగార్జున మేనల్లుడు సుమంత్‌ను వెండితెరకు పరిచయం చేసేందుకు టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చాడు. తరువాత అడపాదడపా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వివాదాలకు కేంద్ర బింధువుగా మారాడు. గతం ఐదేళ్లుగా బాలీవుడ్‌ కన్నా టాలీవుడ్‌ మీదే ఎక్కువగా దృష్టిపెట్టిన వర్మ వరుసగా వివాదాస్పద చిత్రాలతో హల్‌చల్‌ చేస్తున్నాడు.
హైద్రాబాద్ కు మకాం మార్చేసిన ఆర్జీవీ

అయితే తెలుగులో సినిమాలు చేస్తున్న వర్మ ఇక్కడ అధికారికంగా ఆఫీస్ మాత్రం ఓపెన్ చేయలేదు. ముంబైలోని తన ఆఫీస్‌ నుంచే తెలుగు సినిమాల కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తూ వచ్చాడు. అయితే తాజాగా వర్మ హైదరాబాద్‌లో ఆఫీస్‌ ఓపెన్‌ చేశాడు. ఆఫీస్‌ ఫోటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన వర్మ, `నా హైదరాబాద్‌ ఆఫీస్‌ బయట లుక్‌, ఆ సైకిల్ చైన్‌, గన్‌కు మధ్య ఉన్న కిటికీలోనే నా డెన్‌` అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఇన్నాళ్లు ముంబైలో ఉండే ఇక్కడ వరుస వివాదాలు సృష్టించిన వర్మ ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటే ఇంకా ఎంత రచ్చ చేస్తాడో అంటున్నారు సినీ జనాలు.ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వర్మ, ప్రస్తుతం మరో వివాదాస్పద చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై సెటైరికల్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ విషయన్ని కూడా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించిన వర్మ వరుసగా సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను రిలీజ్ చేస్తూ వేడి పెంచుతున్నాడు.