విజయవాడ, నవంబర్ 30, (way2newstv.com)
రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు మారుతున్న జనం ఆకాంక్షలను పట్టుకోలేని నాయకులను పక్కన పెట్టేందుకు అధినాయకత్వం పరీక్షలు పెడుతూంటుంది. ఇపుడు ఏపీలో జగన్ కూడా తన మంత్రులకు పరీక్షలు పెడుతున్నారు. అవి ఎదుర్కొంటేనే మంత్రులుగా కొనసాగేది అని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారని టాక్. వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. ఆ ఎన్నికల్లో బంపర్ విక్టరీని కొనసాగించాలని జగన్ పట్టుదల మీద ఉన్నారు. ఏపీలో 151 అసెంబ్లీ సీట్లు వైసీపీవే ఉన్నాయి. అలాగే 22 మంది ఎంపీ సీట్లు గెలిచారు. దాంతో ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మొత్తం కొల్లగొట్టాలని ఇప్పటినుంచే జగన్ పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.ఏపీలో ముందుగా పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నికల్లో గెలుపు బాధ్యత మంత్రులదే
ఆ తరువాత మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఏపీలో మొత్తం జిల్లా పరిషత్తులు వైసీపీ గెలుచుకోవాలని జగన్ గట్టిగా చెబుతున్నారు. ఈ బాధ్యత మొత్తం మంత్రుల మీద జగన్ ఉంచారని టాక్. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రకాలుగా పనులు చేశామని, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ తీర్చుతున్నామని కూడా జగన్ అంటున్నట్లు భోగట్టా. అందువల్ల ఎక్కడా తేడా రాకూడదని, విపక్షానికి వీసమెత్తు కూడా అవకాశం ఇవ్వకూడదని జగన్ క్లారిటీగా చెప్పేస్తున్నారుట. జిల్లా ఇంచార్జి మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అంతా కలసి ఒక్క మాటగా ముందుకు సాగాలని జగన్ దిశానిర్దేశం చేస్తున్నారట. ఒక విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే మంత్రుల పనితీరుకు గీటు రాయి అని జగన్ పేర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. ఎవరు బాగా పనిచేస్తారో వారికే పెద్ద పీట అని కచ్చితంగా జగన్ చెబుతున్నారని ప్రచారం సాగుతోంది.వైఎస్సార్ అధికారంలో ఉన్నపుడు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని చోట్ల ఓటమి పాలు అయింది. దాంతో ఓటమికి బాధ్యులను చేస్తూ నాడు మంత్రులు కొంతమందిని తన మంత్రివర్గం నుంచి వైఎస్సార్ తొలగించారు. ఇపుడు అదే ఫార్ములాను జగన్ అనుసరిస్తారని వార్తలు రావడంతో మంత్రులు బేజారెత్తుతున్నారు. దీని మీద మరో మాట కూడా వినిపిస్తోంది. ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న మంత్రుల్లో కొంతమంది సరిగ్గా పనిచేయడంలేదని జగన్ వద్ద నివేదికలు ఉన్నాయట. దాంతో ఆయన తరచుగా మంత్రులను హెచ్చరిస్తున్నారని సమాచారం. ప్రజలకు దగ్గరగా ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలను జనాలకు చేరువ చేయాలని ఎంత పోరుతున్నా పనిచేయని మంత్రులు ఉంటే కనుక ఉపేక్షించేది లేదని జగన్ స్పష్టం చేస్తున్నారట. ఇక రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవి ఖాయమని నిబ్బరంగా ఎవరైనా ఉంటే కనుక ఆశలు వదులుకోవాల్సిందేని ముఖ్యమంత్రి క్లారిటీగా చెప్పేస్తున్నారుట. మొత్తానికి చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలే కొలమానంగా మంత్రుల జాతకాలు తేల్చేందుకు జగన్ కసరత్తు పూర్తి చేశారని అంటున్నారు.