నోరు జారుతున్న మంత్రి ధర్మాన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నోరు జారుతున్న మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, నవంబర్ 30, (way2newstv.in)
అదేంటో ఆరు నెలల పాటు ఉగ్గబట్టుకున్న నోరు కాస్తా ఇపుడు ఒక్కసారిగా లేస్తోంది. దాంతో ఉన్న మంచి పేరు కూడా పోతోంది. దూకుడు రాజకీయం చేద్దామనుకుంటే అసలుకే ఎసరు వస్తోంది. శ్రీకాకుళం జిలాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీరు ఇపుడు అలాగే ఉంది. ధర్మాన కృష్ణదాస్ ఇప్పటివరకూ పెద్దగా స్పందించినది లేదు, ధాటిగా మాట్లాడింది లేదు. కానీ ఇసుక దుమారం రేగాక మాత్రం తొలిసారి సౌండ్ చేశారు. తన మీద అక్రమ కేసులు పెడతారా, తాను ఇసుక మాఫియాతో అంటకాగుతున్నానా అంటూ టీడీపీ నేత కింజరపు అచ్చెన్నాయుడు మీద రెచ్చిపోయారు. సవాళ్ళు విసురుతూ తీవ్ర పదజాలంతోనే ధర్మాన కృష్ణదాస్ దూషణలు చేయడంతో అది పెద్ద చర్చగా సాగింది. 
నోరు జారుతున్న మంత్రి ధర్మాన

అది చల్లారకముందే ధర్మాన కృష్ణదాస్ మరోసారి నోరు జారారు. ఆయన‌ వైఎస్సార్ నవశకం ప్రారంభం సందర్భంగా చేసిన కామెంట్స్ ఇపుడు ఏపీవ్యాప్తంగా సంచలనంగా మారాయి.కుక్కకు బిస్కట్లు వేస్తే తోక ఊపుతూ యజమాని పట్ల విశ్వాసంగా ఉంటుంది. జగన్ ఒక్కసారి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నిరుద్యోగులకు పెద్ద ఎత్తుల ఉపాధి కల్పించారు, కనీసం విశ్వాసం ఉండాలి కదా అంటూ కుక్కలతో పోలిక తెస్తూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్న మాటలు ఇపుడు టీడీపీకి అస్త్రంగా మారాయి. చప్పట్లు కొట్టి సర్కార్ ని ప్రోత్సహించరా అంటూ జిల్లాలో జరిగిన నవశకం మీటింగులో ధర్మాన కృష్ణదాస్ కాస్తా ఆవేశంగానే మాట్లాడారు. ఈ దూకుడులో ఆయన కుక్కల ప్రస్తావన ఏ విధంగా తీసుకువచ్చినా కూడా దాని మీద చినబాబు లోకేష్ నుంచి అందరూ ఒక్కసారిగా తగులుకుంటున్నారు. నిరుద్యోగులంటే కుక్కలుగా కనిపిస్తున్నారా అంటూ లేనిపోనివి తగిలించి మరి రఫ్ఫాడించేస్తున్నారు. దీంతో ధర్మాన కృష్ణదాస్ నోరు ఎందుకు చేసుకున్నారురా బాబూ అంటున్నారు వైసీపీ నేతలునిజానికి మెత్తగా, మెతకగా ఉంటున్నారని ధర్మాన కృష్ణదాస్ మీద ముఖ్యమంత్రికి నివేదికలు వెళ్ళాయని అంటున్నారు. దానికి తోడు కింజరపు కుటుంబంతో తెరచాటు దోస్తీలు కూడా వైసీపీ అధినాయకత్వానికి తెలిసిపోతున్నాయి. దీంతో గట్టిగా ఉండాలని ధర్మాన కృష్ణదాస్ నిర్ణయించున్నారని అంటున్నారు. జిల్లాలో అధికారులను సైతం కట్టడి చేయాలని, పార్టీని గాడిలో పెట్టాలని ధర్మాన కృష్ణదాస్ అనుకుంటున్నారు. మంత్రిగా జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న తాపత్రయంతో ధర్మాన కృష్ణదాస్ ఉన్నట్లు చెబుతున్నారు.పార్టీ మెజారిటీ సీట్లు గెలిచినా క్యాడర్ పడకేసింది. వర్గ పోరు జోరందుకుంది. చూస్తూంటే స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దాంతో వత్తిడికి లోనవుతున్న ధర్మాన కృష్ణదాస్ సత్తా చూపించాలనుకుంటున్నారు. అయితే తన బాడీ లాంగ్వేజ్ కి పూర్తిగా విరుధ్ధమైన వ్యవహారాన్ని మంత్రి చూపలేకపోతున్నారని అంటున్నారు. నిజానికి ధర్మాన ప్రసాదరావు జిల్లా మంత్రిగా ఉన్నపుడు శాఖల పైన పట్టు పెంచుకుని అధికారులతో పని చేయించేవారు. జిల్లా రాజకీయాల్లో సైతం ఎప్పటికపుడు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగారు. ఆయన ఎపుడు మాటలు తూలలేదు. మరి ధర్మాన కృష్ణదాస్ ఈ విధంగా చేతలకు బదులు నోటికి పని చెప్పడంతో అభాసుపాలు అవుతున్నారని అంటున్నారు. మరి ఇకనైనా తీరు మార్చుకుంటారో లేదో చూడాలి