వ్యవసాయ రుణాలకు ప్రైవేట్ వడ్డీలే దిక్కు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వ్యవసాయ రుణాలకు ప్రైవేట్ వడ్డీలే దిక్కు

ఖమ్మం, నవంబర్ 12, (way2newstv.com)
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లు ముందుస్తు ఎన్నికలు రైతుల్ని మరింత అప్పుల్లోకి నెట్టాయి. పంట పెరిగే సమయంలో వచ్చిన తుఫాన్ కారణంగా మునిగిన పొలాల నష్ట పరిహారం లెక్కులు వేసేందుకు అధికారులకు తీరిక లేదు. రైతులకు రుణాలిచ్చేందు కు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకు రాని పరిస్థితుల్లో అన్నదాతలు అధిక వడ్డీలకు బయట వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి సాగుచేసి ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో కుదేలయ్యే దుస్థితి ఏర్పడింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఈ ఏడు రైతులకు వాతావరణం కొంతమేర సహకరించినా మిగిలిన పరిస్ధితులు అనుకూలించకపోవడంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లోని రైతులకు నేటికీ కొత్త పాసుపుస్తకాలు రాని రైతులు వేలాది మంది ఉండటంతో వారికి బ్యాంకు రుణాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. 
వ్యవసాయ రుణాలకు ప్రైవేట్ వడ్డీలే దిక్కు

దాదాపు 30 వేల మంది రైతులకు రెండో ఫేజ్ ధరణియాప్‌లో తమకు పాసుపు స్తకాలు కావాలని నమోదు చేసుకున్నట్లు రెవిన్యూ యంత్రాంగమే చెబుతున్నారు. దీంతో రైతులు తమ భూముల వివరాలు ఇవ్వలేకపోవడంతో బ్యాంకులు రుణాలివ్వని స్థితిఒక వైపు, మరో వైపు ఎన్నికల సీజన్ కావడం ప్రతిపక్షాలు రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించడంతో బ్యాంకులు కూడా ఆ మేరకు లెక్కలు సమర్పించాల్సి వస్తుందని కొత్త రుణాలివ్వట్లేదనేది రైతు సంఘాల వాదన.ఈ ఏడాది రైతులకు సాగు వ్యయం దాదాపు రెట్టింపైంది. దీనికి కారణం ప్రధానంగా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇదే ఏడాదిలో మూడు మార్లు పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరలు. మరోవైపు కత్తెర పురుగు వంటి అసాధారణ నష్టం కలిగించే పురుగుల దాడులు వెరసి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఏడాది కత్తెర పురుగు ధాటికి మొక్కజొన్న, పత్తి,మిర్చి పంటలు దిగుబడుల్లో తీవ్ర ప్రభావం పడింది.  పంట సాగు వ్యయం ఎకరాకు రెట్టింపుకాగా, దిగుబడి సగానికి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఓ వైపు బ్యాంకర్లు మొండిచేయి చూపడం, మరోవైపు పెరుగుతున్న ఎరువులు, డీజిల్ ధరలు, ఇంకోవైపు పురుగుల ధాటి ఇలా నలువైపులా రైతుల్ని ఇబ్బందిపెడుతుంటే కనీసం భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం పట్ల వివిధ రైతాంగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.పత్తి పంటకు గతేడాది మొదటి తీతకు రూ.5500 ఉంటే ఇపుడది అంతకు తక్కువగా ఉంది. పెసర, మొక్కజొన్న, వరి పంటలకు కూడా ధరలు లేకపోవడంతో రైతులు అందినకాడికి చేలల్లోనే తెగనమ్మి కూలీలకు పంచి ఒట్టిచేతులతో ఇంటికి చేరే పరిస్థితి నెలకొంది. దిగుబడి సగానికి తగ్గినపుడు పంట ధరలు పెరగాల్సిందిపోయి మరింత దిగజారడం వ్యాపారులకు ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నట్లుందని రైతుసం ఘాలు విమర్శిస్తున్నాయి.