రాజకీయ గురువుగా స్వరూపనంద - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజకీయ గురువుగా స్వరూపనంద

విశాఖపట్టణం, నవంబర్ 2, (way2newstv.com)
ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా జరిగిందో లేదో తెలియదు కానీ విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారి పుట్టిన రోజు మాత్రం అద్భుతంగా జరిగింది. ఏకంగా ప్రభుత్వమే దిగివచ్చేసింది. ఓ వైపు గవర్నర్ కూడా ముఖ్య అతిథిధగా హాజరయ్యారు. ఇక మంత్రులు సామంతులకు ఆశ్రమమే సచివాలాయంగా అయిపోయింది. స్వామిజీ ఇంతవరకూ అనేక పుట్టిన రోజులు జరుపుకున్నారు కానీ ఈసారి జరిగిన వేడుక మాత్రం నభూతో నభవిష్యత్ అన్న తీరున సాగిపోయింది. 
రాజకీయ గురువుగా స్వరూపనంద

ఏకంగా ప్రభుత్వమే దగ్గరుండి ఈ వేడుకను జరిపించిందా అన్నంత గొప్పగా స్వామి జన్మదినం వైసీపీ సర్కార్ పర్వదినంగా చేశారు. విశాఖ స్వామిజీకి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు తెలపడంతో మొదలైన హడావుడి రోజంతా సాగింది.స్వామీజీ పుట్టిన రోజు వేడుకలు వారం పది రోజుల ముందు నుంచి విశాఖలో ప్రారంభం అయిపోయాయి. ఎన్నడూ లేని విధంగా రియల్టర్లు భారీ కటౌట్లు నగర వీధుల్లో పెట్టి స్వామికి అభినందనలు తెలపడం ఈసారి విశేషంగా చెప్పుకోవాలి. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి జన్మదిన వేడుకలు మాదిరిగా స్వామి పుట్టిన రోజుకు విశాఖ మొత్తం ముస్తాబు చేసేశారు. ఇక మంత్రి అవంతి శ్రీనివాసరావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, స్పీకర్ తమ్మినేని సీతారాం , ఎంపీలు, ఎమెల్సీలు, అధికారులు అనధికారులు రోజంతా ఆశ్రమంలోనే గడిపారంటే స్వామి ఎంతటి శక్తిమంతుడో చాటి చెప్పినట్లైంది.స్వామి సహజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులని గతంలో అభిమానించేవారని పేరు తెచ్చుకున్నారు. ఇక అయిదేళ్ల పాటు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నపుడు బాబుకు వ్యతిరేకంగా హాట్ కామెంట్స్ చేసి తమ్ముళ్ల ఆగ్రహానికి గురి అయ్యారు. బాబు సీఎంగా ఇలా ప్రమాణం చేశారో లేదో రాత్రి ముహూర్తాన ప్రమాణం చేయడం రాష్ట్రానికి అరిష్టమంటూ స్వామి చేసిన ప్రకటనలు నాడు కలకలం రేపాయి. ఇక పుష్కరాల సందర్భంగా బాబు సర్కార్ ని స్వామి తప్పుపడుతూ నాడు ఇచ్చిన స్టేట్ మెంట్స్ వేడి పుట్టించాయి. గుళ్ళను తొలగిస్తున్నారని, హైందవ ధర్మాన్ని కాలరాస్తున్నరని, తాను బాబుపైన ధర్మ పోరాటం చేస్తానని బాహాటంగా ప్రకటించిన స్వామిజీ బాబుకు టార్గెట్ అయ్యారు.ఇక అప్పట్లో స్వామీజీ ఆశ్రమం మీద టీడీపీ సర్కార్ వేధింపులకు పాల్పడిందని కూడా ప్రచారం జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మరో వైపు స్వామికి దగ్గర కావడం, ఆయన అనుకున్నట్లుగా మంచి మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి కావడంతో స్వామి రాజగురువు పాత్రలోకి మారిపోయారని టీడీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. దానికి కొనసాగింపుగా స్వామి జన్మదినాన్ని వైసీపీ దగ్గరుండి జరిపించిందని కూడా రాజకీయ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి స్వామి తాను అన్నిటికీ అతీతుడిని, కేవలం ధర్మ పరిరక్షణ తన ధ్యేయమని చెబుతున్నా కూడా ఆయన పుట్టిన రోజున మొత్తం వైసీపీ నేతల హడావుడి చూస్తూంటే స్వామికి కూడా రాజకీయ రంగు పడిపోయిందని అంటున్నారు.