తీవ్ర ఒత్తిడిలో తెలుగు సీఎంలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తీవ్ర ఒత్తిడిలో తెలుగు సీఎంలు

హైద్రాబాద్, నవంబర్ 9 (way2newstv.com)
ఆరు నెలల క్రితం వరకూ ఇద్దరూ ఎదురులేని నేతలే. రెండు తెలుగు రాష్ట్రాలో ఉమ్మడిగా చక్రం తిప్పేయాలనుకున్నారు. అన్నదమ్ములుగా మారి ఉమ్మదమ్ములు చూపించాలనుకున్నారు. ఇద్దరూ బంపర్ మెజార్టీతో గెలిచిన వారే. విపక్షం అన్నది లేనే లేదని భావించిన వారే. ఇప్పటికిపుడు ఎవరూ ఎదురుతిరగరని, జనం మొత్తం ప్రతిపక్షాలకు సున్నం బొట్టు పెట్టాయని చాలా ధీమా చేశారు. సీన్ కట్ చేస్తే రెండు నెలలుగా ఇద్దరు సీఎం లకు ఒకేటే తలపోటు. ఎన్నికల సమరంలో చావుదెబ్బ తిన్న ప్రతిపక్షాలు ఇపుడు ఉవ్వెత్తున లేచి పెనుసవాల్ చేస్తున్నాయి. ఊపిరాడ నివ్వడంలేదు. గుక్కతిప్పుకోనివ్వడంలేదు. దాంతో ముఖ్యమంత్రుల ముఖాల్లో నవ్వులు మాయమైపోయాయి. ఆందోళన దాచుకున్నా దాగడంలేదు. అసలు ఎందుకు ఇదంతా. ఒక్కసారిగా కారుమేఘాలు ఎందుకు కమ్ముకున్నాయి.
తీవ్ర ఒత్తిడిలో తెలుగు సీఎంలు

తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ కత్తికి తిరుగులేదు, ఆయన చెప్పిందే శాసనం. నిజానికి కేసీఆర్ కన్నెర్ర చేస్తే అంతే సంగతులు అన్న మాట అంతటా ఉంది. కానీ ఆర్టీసీ సమ్మె పేరిట జరుగుతున్న ఆందోళన మాత్రం కారు సార్ ని కునుకు తీయనీయడంలేదు. కేసీఆర్ మొదట్లో దీన్ని పట్టించుకోలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళి సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని ధాటిగానే మాటలు విసిరారు. ఇపుడు చూస్తే సెల్ఫ్ డిఫెన్స్ లో తెలంగాణా పెద్దాయన పడిపోయారు. ఈ పరిణామాలే కేసీఆర్ లో కలత పెంచుకుతున్నాయి. ఓ వైపు రాజ్ భవన్ లో గవర్నర్ గా వచ్చిన బీజేపీ మనిషి తమిళ్ సై శై విపక్షాలకు పెద్ద దిక్కుగా మారారు. ప్రజా దర్బార్ పేరిట ఆమె జనంలోకి వచ్చేస్తున్నారు. తాను వైద్యురాలిని అంటూ అన్నిటికీ వైద్యం చేయాలని చూస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఢిల్లీ చూపు కూడా ఇటే ఉందన్నది కూడా గులాబీ బాస్ కి అర్ధం కానిదేమీ కాదు. అందువల్ల ఎటునుంచి కధ ఎటు మలుపు తిరుగుతుందో తెలియడంలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచినా కూడా ఆర్టీసీ సమ్మెట పోటు తప్పడంలేదు.జగన్ కి 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. దాంతో పటిష్టమైన రాజకీయ భవనాన్ని ఆయన నిర్మించుకున్నానని అనుకున్నారు. అయితే ఒక్కసారిగా చెలరేగిన ఇసుక తుపాను కొత్త సీఎం కి విసుగు తెప్పిస్తోంది. అది ఎటు తిరిగి ఎటు విసురుతుందో కూడా అసలు అర్ధం కావడంలేదు. ఇసుకే కదా అనుకుంటే భవనాలే కట్టడమే కాదు, రాజకీయ సౌధాలను కూల్చగలనంటోంది. మరీ ఇంత తొందరగా విపక్షాలు అన్నీ కలసికట్టుగా మీదకు దండెత్తి వస్తాయని జగన్ కనీసంగా ఊహించలేకపోయారు. నిజానికి జగన్ విప్లవాత్మకమైన విధానాలతో పాలన సాగిస్తున్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. అడిగింది కాదనకుండా ప్రతిదీ చేసి పెడుతున్నారు. అయినా సరే ఇసుక దుమారం పెద్ద ఎత్తున దూసుకువస్తోంది. . పాతాళానికి ప‌డిపోయాయ‌నుకున్న విపక్షాలు దాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కసారిగా పైకి లేచాయి. దీంతో జగన్ సర్కార్ చిక్కుల్లో పడుతోంది.ఏపీలో కానీ తెలంగాణాలో కానీ ఆత్మహత్యలు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. అక్కడ ఆర్టీసీ సిబ్బంది ఆత్మ హత్యలు చేసుకుంటూంటే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఉరితాడు బిగించు కుంటున్నారు. లక్షల్లో రెండు చోట్లా కార్మికులు, వారి కుటుంబాలు ఉన్నాయి. దాంతో ప్రతీ చావూ సర్కార్ వైఫల్యంగా మారిపోతోంది. ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డైరెక్ట్ గా ప్రతిపక్షాలు గర్జిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఇద్దరు సీఎం ల పరిస్థితి ఒకేలా ఉంది.