నయా పాలిట్రిక్స్ చేస్తున్న గుంటూరు నేతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నయా పాలిట్రిక్స్ చేస్తున్న గుంటూరు నేతలు

గుంటూరు, నవంబర్ 8, (way2newstv.com)
ఏపీ రాజ‌ధాని ప్రాంతం గుంటూరు రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ జిల్లాలో రాజ‌కీయాలు ఎప్పుడు చ‌ర్చకు వ‌స్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ బాగా పుంజుకుంది. దీంతో ఇక్కడి వైసీపీ రాజ‌కీయాలు కూడా రోజుకో రకంగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. నాయ‌కుల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయిలో సాగుతున్నాయి. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌రు వేలు పెట్టడాన్ని నాయ‌కు లు స‌హించ‌లేక పోతున్నారు. అదే స‌మ‌యంలో త‌మ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కులను కాద‌ని, ప‌క్క నియోజ క వ‌ర్గాల నాయ‌కుల‌తో స్నేహం చేస్తున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ రాజ‌కీయాలు రోజుకోరకంగా మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
నయా పాలిట్రిక్స్ చేస్తున్న గుంటూరు నేతలు

విష‌యంలోకి వెళ్తే.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరు.. వైసీపీలో చ‌ర్చకు దారితీస్తోంది. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి డాక్టర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి విజ‌యం సాధించారు. అయితే, ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్ బాప‌ట్ల నుంచి ఎంపీగా గెలుపు గుర్రం ఎక్కారు. ఆయ‌న ఎంపీయే అయినా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంతో ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఎలాంటి సంబంధం లేదు. బాప‌ట్ల ఎంపీగా చేయ‌డానికేం లేక‌పోవ‌డంతో ఆయ‌న తాడికొండ పాలిటిక్స్‌పై బాగా ఇంట్రస్ట్ చూపిస్తూ ఇక్కడ ఓ గ్రూపు మెయింటైన్ చేస్తున్నారు. కానీ, ఆయ‌న ఇక్కడి ఇసుక వ్యవ‌హారం స‌హా ప‌లు విష‌యాల్లో వేలు పెట్టారు. అయితే, ఈ ప‌రిస్థితిని శ్రీదేవి స‌హించ‌లేక పోయారు. ఏదైనా ఉంటే త‌న‌తో మాట్లాడాలి కానీ, నేరుగా లాబీయింగులు ఎలా చేస్తార‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారుదీంతో వీరిద్దరి మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేర‌డం, నేరుగా పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కే దీనిపై ఫిర్యాదు లు అంద‌డం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలోనే శ్రీదేవి యాంటీ వ‌ర్గం సురేష్‌కు చేరువైంది. ఇక‌, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి మ‌ధ్య వివాదాలు న‌డుస్తున్నాయి. తాడికొండ త‌న నియోజ‌క‌వ‌ర్గం కాకపోయిన‌ప్పటికీ.. ర‌జ‌నీ ఇక్కడ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నార‌ని, ఇటీవ‌ల ఓ కార్యక్రమానికి హాజ‌రుకావ‌డాన్ని శ్రీదేవి ప్రశ్నించ‌డం, ఆ వెంట‌నే స‌భ నుంచి ఆమె హ‌ఠాత్తుగా వెళ్లిపోవ‌డం తెలిసిందే. క‌ట్ చేస్తే.. వీరిద్దరి మ‌ధ్య ఈ విష‌యం ఇప్పటికీ హాట్‌హాట్‌గానే ఉంది.అయితే, చిల‌క‌లూరిపేట‌లో విడ‌ద‌ల కోసం టికెట్ త్యాగం చేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు విడ‌ద‌లకు మ‌ధ్య విభేదాలు సాగుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు మ‌ర్రితో క‌లిసి తిరిగి, త‌న గెలుపునకు సాయం చేయాల‌ని కోరిన ర‌జ‌నీ గెలిచిన త‌ర్వాత ఆయ‌న‌ను పూర్తిగా ప‌క్కన పెట్టింది. త‌న‌కు ఎక్కడ మ‌ర్రి మ‌ళ్లీ పోటీ వ‌స్తాడ‌ని అనుకుందో ఏమో.. విడ‌ద‌ల రజనీ ఆయ‌న‌ను పూచిక పుల్లగా భావిస్తోంది. అయితే, వైసీపీలో సీనియ‌ర్ కావ‌డంతో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉంటున్నారు. మ‌ర్రిని క‌లిసి ఆయ‌న స‌ల‌హాలు తీసుకోవ‌డం, ఆయ‌న పుట్టిన రోజునాడు ఇంటికి వ‌చ్చి విషెస్ చెప్పడం తెలిసిందే. ఎన్నిక‌ల్లో మ‌ర్రి తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలో ఉన్న గ్రూపు గొడ‌వ‌ల‌ను ప‌రిష్కరించి శ్రీదేవికి సాయం చేయ‌డంతో ఆమె మ‌ర్రి ప‌ట్ల కృత‌జ్ఞత‌తో ఉంటున్నారు.క‌ట్ చేస్తే.. నందిగం వ‌ర్సెస్ శ్రీదేవి కీచులాడుకుంటున్నారు. అటు మ‌ర్రి వ‌ర్సెస్ విడ‌ద‌ల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఏర్పడింది. అయితే, ఇక్కడ చిత్రమేంటంటే.. శ్రీదేవితో గొడ‌వ ప‌డుతున్న ఎంపీ నందిగంతో విడ‌ద‌ల ర‌జ‌నీ స్నేహంగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌ను ఇంటికి ఆహ్వానించి మ‌రీ నియోజ‌క‌వ‌ర్గం గురించి వివ‌రిస్తూ.. ఆయ‌న నుంచి స‌ల‌హాలు తీసుకుంటున్నారు. ఇటు, ర‌జ‌నీకి శ‌త్రువుగా ఉన్న మ‌ర్రితో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి స్నేహం చేస్తున్నారు. ఆయ‌న‌ను ఫోన్ల‌లో సంప్రదించ‌డం, ఆయ‌న స‌ల‌హాలు తీసుకోవ‌డం వంటివి చేస్తున్నారు. ఇలా ఇద్దరూ కూడా త‌మ త‌మ శ‌త్రువుల‌కు శ‌త్రువులుగా ఉన్న వారితో స్నేహ గీతం పాడుతుండ‌డం జిల్లాలో ఆస‌క్తిగా మారింది.