నల్గొండ, నవంబర్ 08 (way2newstv.com):
జిల్లాలో వరితో పాటు పత్తిని ప్రధానంగా సాగు చేస్తారు. సాగునీటి వనరులు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు పత్తి పంటవైపే ఆసక్తి చూపిస్తారు. ఈ పంట సాగులో రైతులకు కష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని విక్రయించుకోవడం చాలా కష్టంగా ఉంది. దిగుబడి వచ్చే సమయానికి సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రంగప్రవేశం చేశారు. గ్రామాల్లో రైతుల ఇళ్ల వద్ద పత్తి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పత్తి దిగుబడి వచ్చేసింది. పత్తి పంట చేతికొచ్చే ముందు నుంచి ప్రతి రోజూ వరుణదేవుడు ఏదో సమయంలో వచ్చిపోతున్నాడు. దీంతో పత్తి పూర్తిగా తడిచి ముద్దయింది. రైతులంతా దానిని ఆరబెట్టడానికి అనేక తంటాలు పడుతున్నారు. అవకాశం ఉన్న చోట వ్యవసాయ బావి దగ్గర ఆరబెడుతున్నప్పటికి పెద్దగా ఫలితం లేకుండా పోతోంది.
అడుగడుగునా దగా (నల్గొండ)
ఆ అవకాశం లేని రైతులు ఇళ్లల్లోనే ఫ్యాన్లు ఏర్పాటు చేసి పత్తి ఆరబెడుతున్నారు. అయినా పత్తి కొంత నల్లగా మారుతోంది. దానివల్ల మద్దతు ధర వస్తుందో లేదోనని ఆందోళనలో ఉన్న రైతన్న బలహీనతను ఆసరాగా చేసుకున్న పత్తి కొనుగోలు చేసే దళారులు క్వింటాలు పత్తిని రూ.2500 నుంచి రూ.3500 వరకే కొనుగోలు చేసి వారికి నష్టం కలిగిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5550. అయితే పత్తి తడిసింది... నల్లమచ్చ వచ్చింది.. ధర రాదు అంటూ రైతులను భయానికి గురిచేస్తున్నారు. దీంతో రైతులు దళారులు చెప్పిన ధరకు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే నార్కట్పల్లి, మునుగోడు, చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడ, దేవరకొండ ఏరియాలలో దళారులు ప్రవేశించి పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో అన్నదాతకు మద్దతు ధర అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నష్టం జరిగితే అలాంటి వారిపై చర్యలకు వెనుకడుగు వేయొద్దని జిల్లా ఉన్నతాధికారులు పదే పదే మార్కెటింగ్ అధికారులకు చెపుతున్నారు. అయినా గ్రామాలలో దళారులు అతితక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్న విషయం తెలిసినా ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారని సమాచారం. కనీసం ఇప్పటి వరకు మద్దతు ధర.. దళారులకు పత్తి అమ్మి నష్టపోవద్దనే విషయాన్ని ఇంతవరకు మార్కెట్ అధికారులు ప్రచారం కూడా కల్పించలేదు. దళారులు పత్తి కొనుగోలు చేస్తున్న సమాచారం తెలిసి కూడా మార్కెట్ అధికారులు కనీసం స్పందించడంలేదు. దీనికి కారణం వారిద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు ప్రచారంలో ఉంది. అందుకే ఎక్కడ గ్రామాలలో మార్కెట్ అధికారులు తిరగడంలేదు. సీసీఐ కేంద్రాలు ఎప్పుడు ప్రారంభం చేస్తారో కూడా కనీసం రైతులకు సమాచారం ఇవ్వడంలేదు. మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే రైతులు ఆందోళనతో పత్తిని నష్టంతో విక్రయిస్తున్నారు.