చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న రైతులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న రైతులు

చెప్పులతో దాడి
అమరావతి నవంబర్ 28 (way2newstv.com)
గురువారం ఉదయం తెలుగుదేశం అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన అమరావతి యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయన పర్యటనలో  రైతుల పోటాపోటీగా నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ వైపు దూసుకెళ్లేందుకు ఓ వర్గం రైతుల యత్నించగా, నిరసనగా మరో వర్గం రైతులు ఆందోళన చేశారు. యాక్సెస్ రోడ్డులో నల్ల బ్యానర్లు వెలిశాయి. వాణిజ్య స్థలాల విషయంలో రైతులను మోసం చేశారంటూ బ్యానర్లను ప్రదర్శించారు. గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఉచిత విద్య, వైద్యం ఒక్కరికీ కల్పించలేదంటూ నల్ల బ్యానర్లు వెలిశాయి. 
చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న రైతులు

చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ, వైసీపీ బాహాబాహీగా నినాదాలు చేశారు. పోలీసులతో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. వెంకటపాలెంలో ఇరు  వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చంద్రబాబు కాన్వాయ్ ని చూడగానే ఓ వర్గం వారు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులు, కర్రలతో దాడి చేశారు.నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు కాన్వాయ్ కి దారి కల్పించారు. యాత్రకు ముందు చంద్రబాబు ట్వీట్టర్ లో వ్యాఖ్యానించారు. అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీచమైన కుట్రలకు వైసీపీ తెరతీసిందని చంద్రబాబు అన్నారు. ఆ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో పర్యటిస్తున్నానన్నారు. కాగా, అమరావతి అభివృద్ధికి తాము తమ ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు రూపొందిస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోతున్నాయని, వాటిని ఎత్తిచూపుతానని అన్నారు.