ఫాస్టాగ్ తో టోల్ ట్రాఫిక్ లకు చెక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫాస్టాగ్ తో టోల్ ట్రాఫిక్ లకు చెక్

నల్గొండ, నవంబర్ 29  (way2newstv.com)
టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పడనుంది. టోల్ చెల్లించేందుకు ఒక్కోసారి గంటల పాటు వేచి చూడాల్సి రావడం జరుగుతోంది.  కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. అంటే జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ఫాస్టాగ్‌ను ఖచ్చితంగా కలిగి ఉండాలి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వ్యవస్థను రూపొందించింది. గతంలో కేవలం ఒక లైన్‌లో మాత్రమే ఫాస్టాగ్ విధానాన్ని కొన్ని ప్రాంతాల్లో అమలు చేశారు. ఈ విధానం విజయవంతం అయినప్పటికినీ వాహనాల సంఖ్య భారీగా ఉండటం, రాకపోకలు పెరగడంతో టోల్‌గేట్ల వద్ద ఉన్న అన్ని లైన్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఒక టోల్‌గేట్ వద్ద దారికి ఇరువైపుల మొత్తం 12లైన్లు ఉంటాయి. అయితే ఇందులో రెండు లైన్లలో అప్పటికప్పుడు రుసుం చెల్లించి టోల్‌గేట్ దాటే విధంగా పాత విధానాన్ని ఉంచుతుండగా మిగతా లైన్లలో మాత్రం ఫాస్టాగ్‌ను నూటికి నూరు శాతం అమల్లోకి తీసుకురానున్నారు.
ఫాస్టాగ్ తో టోల్ ట్రాఫిక్ లకు చెక్

దీని వల్ల సమయం వృథా కావడంతో పాటు భారీగా పెట్రోల్, డీజిల్ కూడా వృథా అవుతోంది. అంతేకాకుండా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరుగుతున్నది. దీంతో ఒక వాహనం సగటున టోల్‌ప్లాజా రుసుం చెల్లించి దాటడానికి ఐదు నిమిషాలకుపైగా సమయం తీసుకుంటుండటంతో దూరప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా మారుతోంది. ఈ క్రమంలో కొన్ని సార్లు టోల్ సిబ్బందికి, వెహికిల్ ఓనర్లకు మధ్య గొడవలూ జరిగిన సందర్భాలు కోకొల్లలు. ఒక్కోసారి పోలీసులు కల్పించుకుని ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పరిస్థితులు రావడం మనం చూసే ఉంటాము. దీనికి తోడు నగదు వసూళ్లు.. బ్యాంకుల్లో జమ చేయడంతోపాటు మానవ శ్రమ కూడా ఎక్కువగా ఉపయోగించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీని వల్ల వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఏటా టోల్ గేట్ల దగ్గర వాహనాల వెయిటింగ్ సమయం, ఇంధనం వృథా విలువ రూ.80 వేల కోట్ల మేర ఉంటుందని ఓ సర్వే కూడా తేల్చింది. వేగంగా వెళుతున్నప్పుడు అడ్డ దారిలో నిలువెత్తు బోర్డులతో ప్రతీ సారీ అద్దం తగులుతూ, మన వాహనాన్ని ఆపి డబ్బులు తీసి రసీదు తీసుకొని అబ్బబ్బా సమయం వృథా… అలాకాకుండా మన వాహనం ఆగకుండానే రయ్యి రయ్యి మని వెళుతూ ఆ కట్టాల్సిన డబ్బులేవో ఆటోమేటిగ్గా అవే తీసేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఈ ఆలోచన …అవును ఇదే విదానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దానినే ఫాస్టాగ్ అంటారు. జాతీయ రహదారుల మీద టోల్ ప్లాజాల దగ్గర ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఇటిసి) ప్రక్రియ స్థానంలో మరింత ఆధునీకరించిన వ్యవస్థను తీసుకు వచ్చారు. ఈ వ్యవస్థనే ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత డివైజ్.టోల్ గేట్ల దగ్గర ఐదారు వాహనాల వరుసలు ఉంటే.. అందులో ఒక్క మార్గాన్ని మాత్రమే డబ్బు చెల్లింపులకు అనుమతిస్తారు. మిగతా వాటన్నింటినీ ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలకే కేటాయిస్తారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు ఈ మార్గాల్లోకి వస్తే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ కచ్చితంగా ఉండాలి.ఎన్‌పిసిఐ నిర్ణయంతో డిజిటల్ పేమెంట్స్ కూడా పెరగనున్నాయి. అలాగే వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద గంటలు..గంటలు.. వేచిచూడాల్సిన అవసరం తప్పుతుంది. అనవసర ప్రయాస తగ్గుతుంది. అనుకున్న సమయానికి గమ్యానికి చేరవచ్చు. త్వరగా పాడయ్యే అవకాశం ఉన్న ఆహార పదార్థాలు, తొందరగా అమ్ముకోవాల్సిన పంటలు సకాలంలో గమ్యానికి చేరతాయి. అంటే వృథాను కూడా బాగా అరికట్టవచ్చు. అలాగే ఇంధనం కూడా బాగా ఆదా అవుతుంది. కావున ఆ నిష్పత్తిలో వాయు కాలుష్యం కూడా చాలా తగ్గించొచ్చు. అలాగే ఏ టోల్ ప్లాజాలో ఎంతెంత టోల్ వసూలు చేస్తున్నారు? సంవత్సరానికి ఎంత వసూలు పెరిగింది. అన్న విషయాలు ప్రభుత్వం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా తప్పనిసరి చేయటంతో.. రవాణా, రవాణాయేతర వాహనదారు లందరూ విధిగా ఫాస్టాగ్‌ను వాహనాలకు అమర్చాల్సిందే. వాహనదారులకు ఇంకా అవగాహన లేకపోతే ఇబ్బందిపడే ప్రమాదముంది.ఎలా పనిచేస్తుంది: రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడి) ఆధారంగా ఫాస్టాగ్స్ పని చేస్తాయి. ఫాస్టాగ్‌ను వాహనాల ముందు భాగంలో గల అద్దంపై అతికిస్తారు. వాహనం టోల్ ప్లాజాల వద్ద నుంచి వెళ్లేటప్పుడు దానంతటకదే టోల్ చార్జీలు కట్ అవుతాయి. దీని కోసం వెహికల్‌ను ఆపవలసిన అవసరం లేదు. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ రీడర్స్ వెహికల్ వెళ్లేటప్పుడు అద్దంపై ఉన్న ఫాస్టాగ్‌ను స్కాన్ చేసేస్తుంది. అప్పుడు ఆ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అప్పుడు వాహనదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డబ్బులు కట్ అయినట్లు సందేశం వస్తుంది.ఫాస్టాగ్‌ను నాలుగేళ్ల కిందటనే తీసుకువచ్చారు. అయితే ఇది ఇప్పటి వరకు ఐచ్చికం గానే ఉంది. అయితే డిసెంబర్ 1 నుంచి మాత్రం ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేశారు. దేశ వ్యాప్తంగా 500కు పైగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు చక్రాల వాహనాలైన ప్యాసింజర్ వెహికల్స్, అన్ని వాణిజ్య వాహనాలకు అనగా బస్సులు, కార్లు, ట్రక్స్, ట్రాక్టర్లు, కన్‌స్ట్రక్షన్ మిషనరీ వంటివి ఫాస్టాగ్స్ తప్పనిసరి. టోల్ ప్లాజాల వల్ల కేవలం ఒక్క లైన్ మాత్రమే నగదు రూపంలో చార్జీల చెల్లంపునకు అనుమతిస్తారు. ఇక మిగతా వాటన్నింటిలోనూ ఫాస్టాగ్స్ వ్యవస్థ అమలులోకి వస్తుంది.ఎక్కడెక్కడ తీసుకోవచ్చు: బ్యాంకులకు వెళ్లి ఫాస్టాగ్‌ను తీసుకోవచ్చు. ఎన్‌ఇటిసితో భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకుల వద్దనే ఫాస్టాగ్స్ ఉంటాయి. అంతేకాకుండా టోల్ ప్లాజాల వద్ద కూడా ఫాస్టాగ్ తీసుకోవచ్చు. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డిఎఫ్ సి బ్యాంక్, పేటీఎం పెమెంట్స్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ లతో పాటు ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ఫాస్టాగ్స్ ను విక్రయిస్తోంది. అంతేకాక మై ఫాస్టాగ్ యాప్ ద్వారా కూడా వీటికి కొనుగోలు చేయవచ్చు. ఫాస్టాగ్ కోసం రూ.100 ఫీజు చెల్లించాలి. తర్వాత ఫాస్టాగ్ అకౌంట్‌లోకి డబ్బులు యాడ్ చేసుకోవాలి. ఫాస్టాగ్‌ను ఒకసారి కొనుగోలు చేస్తే ఐదేళ్ల వాలిడిటీని కలిగి ఉంటుంది. వాహనదారుడు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో అలర్ట్ వస్తుంది.ఏమేమి కావాలి: ఫాస్టాగ్ ను యాక్టివేట్ చేసుకోవాలంటే వెహికల్ ఆర్‌సి, వాహనదారుడి ఫోటోగ్రాఫ్, ఇతర ఐడెంటిటీ ప్రూఫ్స్ కావాలి. ఫాస్టాగ్ వాలిడిటీ 5 ఏళ్లు. ఫాస్టాగ్‌ను మైఫాస్టాగ్ యాప్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్ లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో వాహనదారులు టోల్ లైన్‌లో వాహనాన్ని ఆపాల్సిన పని ఉండదు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అయితే సదరు వాలెట్‌లో ఉన్న మొత్తం టోల్ చార్జిల కింద కట్ అయితే వాలెట్‌ను మళ్లీ నిర్దిష్టమైన మొత్తంతో టాపప్ చేయించుకోవాల్సి ఉంటుంది. అసంబద్ధంగా డబ్బు కట్ అయితే? వాహనం పోతే? ఫాస్టాగ్ జారీ చేసిన ఏజన్సీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి రిపోర్టు చేయాలి.ఆ ఏజన్సీ మీ రిక్వెస్టును పరిశీలించి తగిన చర్యలు చేపడుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఫాస్టాగ్‌ను జారీ చేసిన ఏజన్సీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫాస్టాగ్ అకౌంట్‌ను బ్లాక్ చేయించుకోవచ్చు.ఎక్కడ బడితే అక్కడ తీసుకోవడం కుదరదు. కేవలం ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగ్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. ఫాస్టాగ్ లైన్ల మీద ఇతర ట్యాగ్‌లు పని చేయవు. ఫాస్టాగ్‌తో అన్ని నేషనల్ హైవేల మీద ప్రయాణించవచ్చు. మీ వాహనం టోల్ ప్లాజాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఫాస్టాగ్ ద్వారా కన్సెషన్లు పొందవచ్చు. ఫాస్టాగ్ లైన్‌లో వెళితే క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. మీకు కానీ ఫాస్టాగ్ లేకపోతే మీరు వాహనాల వరుసలలో చివర ఉన్న లైన్ గుండా మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది